హైదరాబాద్, వెలుగు: ఫెర్టిలైజర్ యాప్‌కు విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీలో పారదర్శకత పెరిగిందని, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు.
ప్రతిరోజూ వ్యవసాయశాఖ విడుదల చేసే బులెటెన్ల ద్వారా రైతులకు నిల్వల సమాచారం నేరుగా అందుతోందని, దీనివల్ల తప్పుడు ప్రచారాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటివరకు 2.52 లక్షల టన్నుల విక్రయాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. యాప్ ద్వారా 17.70 లక్షల మంది రైతులు 59.78 లక్షల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా, 52.86 లక్షల బస్తాల కొనుగోలు పూర్తయిందన్నారు.
భూమి ఆధారిత పంపిణీ విధానం వల్ల నిజమైన సాగుదారులకే ఎరువులు అందుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే వ్యవసాయ రంగంలో ఏఐ, శాటిలైట్ టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వీటివల్ల భూసారం, పోషకాల లోపాలను గుర్తించి రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తామన్నారు. పంటల పర్యవేక్షణ, వాతావరణ సమాచారం, వ్యవసాయ సలహాలన్నింటినీ ఒకే డిజిటల్ వేదికపైకి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తుమ్మల వివరించారు. ఇటీవల అగ్రికల్చర్ సెక్రటరీ జర్మనీలో పర్యటించి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపినట్లు గుర్తుచేశారు.
