- జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్
హైదరాబాద్‌సిటీ/బషీర్‌బాగ్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించినందుకు యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం హేయమైన చర్య అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది యెర్రా కామేశ్ విమర్శించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రశ్న రావణ్‌పై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారని, ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో కేసులో అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. నాలుగు రోజుల్లో నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, నాలుగు కోర్టుల్లో హాజరుపరచగా ప్రతి కేసులోనూ బెయిల్ లభించిందన్నారు.
ప్రశ్న రావణ్ తరఫున జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ నాలుగు రోజుల పాటు నలుగురు న్యాయమూర్తుల ఎదుట వాదనలు వినిపించి బెయిల్ పొందేలా చేశారని తెలిపారు. భవిష్యత్‌లో ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకుండా చేయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే జనసేన కార్యకర్తలు ప్రశ్న రావణ్‌పై దాడికి ప్రయత్నించారని, ఆయనకు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రావణ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంధం మల్లికార్జునరావు, నాగుల రవికుమార్, తుమ్మ వంశీ, గజ్జల శంకర్ పాల్గొన్నారు.
