ఇడుపు, విడాకులు.. ఏది సరైన పదం..?

ఇడుపు, విడాకులు.. ఏది సరైన పదం..?

‘ఇడుపు కాగితం’ చుట్టూ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతీయ భాషల మధ్య వ్యత్యాసం, గొప్పతనం చుట్టూ చర్చ జరుగుతోంది. మ్యారేజీ అయ్యాక విడిపోయే ప్రక్రియను ఇడుపు అంటే మంచితీరా, విడాకులు అంటే మంచితీరా అనేది ఒక అంశం. మనం  సాధారణంగా రాసుకునే వైట్‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ను కాగితం అంటే మంచి తెలుగా లేక పత్రం అంటే మంచి తెలుగా అనేది కూడా చర్చలో ఉంది. 1960 దశకంలో  నేను గొర్ల, బర్లకాసే పనొదిలేసి స్కూలుకు పోయాక ఊళ్లో చెట్టుకింద పంచాయితీలు అవుతుంటే అక్కడ ఉండి వినడం చాలామంది పిల్లలం చేసేవాళ్లం.

 ఆ పంచాయితీల్లో పెండ్లి అయిన పిల్ల–పిల్లగాని మధ్య కొట్లాట, వారు కలిసి ఉండాలా, ఇడుపు చేసుకోవాలా అనేది ఆ కొట్లాట స్వరూపాన్ని పెద్దమనుషులు నిర్ణయించేవారు. అయితే ఆ ఇద్దరు కలిసుండటం కుదిరేటట్టు లేదనుకున్నాక ఇడుపు చేసుకున్నట్టు  కాయితం రాసుకుని వాళ్ల తల్లిదండ్రుల ఇంటికి పోవడమే ఫైనల్. ఆ తరువాత పిల్ల మళ్లీ  ‘మారుమానం’ పోవచ్చు.  మగాడు మరో అమ్మాయిని ‘మారుమానం’ తెచ్చుకోవచ్చు. ఈ పదాలు అర్థం వాటి పరిణామం అందరికీ తెలుసు. 

తెలంగాణలో 1948 నాటికి ఉర్దూ దాదాపు పాలక భాష కనుక వాళ్ల ఉర్దూ భాషలో ముస్లింలు బహుశా తలాక్ దాన్ని రాత రూపంలో పెట్టుకుంటే ‘తలాక్‌‌‌‌ నామా’ అనేవారు కావచ్చు.  కానీ అది కూడా ఉత్పత్తి సంబంధాల్లో పుట్టిన వ్యాఖ్య కాదు.  దాదాపు 1960లలోనే  గ్రామాలలో ఇడుపును రాసుకుని దాన్ని ఇడుపు కాయితంగా పిలవడం ఎక్కువైంది.  విచిత్రమేమంటే ఈ ఇడుపు కాయితాన్ని బ్రాహ్మణ పంతులు రాసేవాడు కాదు. మా ఊళ్లో కూడా ఇడుపు కాయితం  రాయడానికి  కొద్దో గొప్పో చదువుకున్న శూద్రుని కోసం వెతికేవారు లేదా పక్క ఊరి నుంచి తీసుకువచ్చేవారు.  

బ్రాహ్మణ పంతులెందుకు రాయడు..? 

అప్పటికి కూడా  బ్రాహ్మణులలో ఇడుపు పద్ధతికి ఒప్పందం లేదు.  పెండ్లయిన పిల్లకు ఇంట్లో ఎంత హింస ఉన్నా మగానితోటి సచ్చినట్టు పడి ఉండాలి.  కానీ శూద్రుల్లో,  దళితులలో, ఆదివాసులలో ఇడుపు, మారుమానం మామూలే.  ఆంధ్ర భాష ఆధిపత్యం పేరుతో జరిగే చర్చలో  కేవలం భాష,  ప్రాంతం మాత్రమే కాదు కులం అసలు పునాదిగా ఉంది.  ఆంధ్ర ప్రాంతం శూద్రుల్లో,  దళితులు ఇడుపు ఎల్లప్పుడూ ఉంది. కానీ బ్రాహ్మణులలో లేదు. విడ+ఆకులు = విడాకులు అనే పదాన్ని వాళ్లు తరువాత కాలంలో సంస్కృతం నుంచో మరో భాష నుంచో అరువు తెచ్చుకున్నారు.

  భర్త చనిపోయినా శూద్రుల్లో  రెడ్లు, వెలమలు, కమ్మలతో సహా పర్మినెంటు ముండరికం లేదు. మారుమానం ముండకు ఉంది.  భర్త  చనిపోయిన స్ర్తీ మళ్లీ ముత్తైదువ అవుతుంది. ఇది బ్రాహ్మణుల్లో లేదు. ఉత్పత్తి కులాల భాషలో ‘పెండ్లిగాను’  అనే పదముంది.  అది  చెడినప్పుడు ‘పెండ్లి పెడాకులుగాను’ అనే  పదముంది. పెండ్లిగాను అంటే పెండ్లి జరగాలి అని, పెండ్లి పెడాకులుగాను అంటే విడిపోవాలి అని అర్థం.  

‘ఇడుపు’ చాలా పునాదులున్న పదం

ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉత్పత్తి,  పునరుత్పత్తి క్రమంలో  శూద్ర భాషగా అభివృద్ధి అయింది. ఆంధ్ర ప్రాంతంలో  నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడల సంస్కృత అనువాదం నుంచి  వచ్చిన  పదాలను  జీవన ప్రక్రియకు అనువదించుకునే భాషను తెలుగు అనడమే పూర్తిగా తప్పు.  

ఏ భాషకైనా ఉత్పత్తి, పునరుత్పత్తి సంబంధాల్లో ఎదుగుదల ప్రమాణంగా ఉంటుంది.  బ్రాహ్మణ కుటుంబాల్లో మొన్న మొన్నటివరకు  అమలులేని ‘ఇడుపు’కు  ఒరిజినల్​ వాడుక పదం ఎక్కడినుంచి వస్తుంది.  విడాకులనే పదం ‘ఇడుపు’ అనే  పదంకంటే గొప్పదని వాదిస్తే  ఒక్కరోజు కోసం వేశం ఏసుకుంటే, అది నాచురల్​ డ్రెస్‌‌‌‌కోడ్​ కంటే వేశండ్రెస్​ కోడ్​ గొప్పదంటే అంతకంటే  తెలివితక్కువతనం ఏముంటుంది? ఎప్పుడైనా తెలివి తక్కువతనానికి గర్వం ఎక్కువ.  అదే మనకు విడాకులు అనే పదం వాడేవారిలో  కనబడుతుంది. 

కాయితం, పత్రం

మనం ఇప్పుడు రాసుకునే వైట్ పేపర్‌‌‌‌‌‌‌‌ను కాయితం అంటే గొప్ప పదమా,  పత్రం అంటే గొప్ప పదమా అనేది ఇంకా ఎక్కువ  తెలివితక్కువ చర్చ. కాగితం అనే పదం శూద్ర భాషలోకి పలుచటి, పొడగాటి రాతకు వీలైన లెదర్‌‌‌‌‌‌‌‌స్క్రోల్‌‌‌‌  నుంచి  వచ్చింది. పత్రం అనేది అతి అసహజ ‘తాళపత్రం’ (తాటి ఆకు)  అనే రూపం నుంచి వచ్చింది.  

కౌటిల్యుడి అర్థశాస్త్రం  మొట్టమొదట ఒక  బ్రాహ్మణుడిగా అక్షర రూపం ఇచ్చిన పుస్తకం. ప్రపంచ రచయితలైన ఇజ్రాయెల్, గ్రీకులు  రాసినట్టు వాళ్ల  లెదర్‌‌‌‌‌‌‌‌స్ర్కోల్స్‌‌‌‌పై  ఆయన రాయలేదు. అందుకు బదులు వాళ్లు పసరుతో తాటాకులపైన  రాయడం ప్రారంభించారు. తాటాకు చాలాకాలం  బతుకలేవు కనుక  తాటాకును బోలిన చెక్కలపై  రాయడం మొదలుపెట్టారు. ఇది ఆనాటికి అభివృద్ధి అయిన రాత సైన్సును అలవరుచుకోక మూఢనమ్మకంలోకి చొరబడ్డారు. అందుకే కాగితం వైట్‌‌‌‌పేపర్‌‌‌‌‌‌‌‌కు బెటర్‌‌‌‌‌‌‌‌ పేరు.  పత్రం పూర్తిగా తెలివితక్కువపేరు.  పత్రం అంటే ఆకు.  పేపర్ కాదు.  

సంస్కృతం నుంచి వచ్చిన పదాలకు ఉత్పత్తి పునాది లేదు

నాగలి అనే భూమిని దున్నే అన్నిరకాల  టెక్నాలజికల్‌‌‌‌  అరేంజ్‌‌‌‌మెంట్లు ఉన్నదాన్ని ఇప్పుడు  మా తెలుగు గొప్పది అనే ఆంధ్రవాదులు ‘హాలము’  అని రాయడం తెలుసు. ‘హల్’ అనే సంస్కృత  పదానికి ‘ము’ కలిపి అది తెలుగు అంటున్నారు.  ఇంతకంటే  తెలివితక్కువనం ఇంకోటుందా?  నాగలి అనే పేరు శూద్ర సమాజం దాని టెక్నలాజికల్​ డిజైన్‌‌‌‌, దాని పనితనానికి పెట్టిన పేరు.  

సంస్కృత రచయితలు దున్నుడు అనే పనిని ద్వేషించుకున్నారు. నాగలి అనేది దున్నుడు అనే పనికి  పాజిటివ్​ పేరు . హలము అనేది నెగెటివ్​ పేరు. హలము అనేది గొప్ప పదంగా చెప్పడం ఎంత తెలివితక్కువతనం?  అలానే ‘బువ్వ’ అనే పేరు వడ్ల నుంచి వచ్చిన తిండి పదార్థాలకు శూద్ర పేరు. ఇది  ఆ గింజల తిండి పదానికే వర్తిస్తుంది. కానీ, ఆంధ్ర బ్రాహ్మణుల  తెలివితక్కువతనం దానికి సంస్కృత ‘అన్న్‌‌‌‌’ అనే పదానికి ‘ము’ కలిపి ‘అన్నము’ అని పిలుస్తారు.

‘అన్న్‌‌‌‌’  కేవలం వారి గింజల నుంచి తయారుచేసిన తిండి పదార్థానికి పెట్టిన పేరుకాదు.  చాలా తిండి పదార్థాలకు ఆ పేరు వర్తిస్తుంది.  ఎందుకంటే  సంస్కృత  రచయితలకు వివిధ గింజల పేరు లక్షణం తెలియదు. దాని పంట విధానం తెలీక ఒక్కపేరుతో అన్ని తిండి పదార్థాలను పిలుచుకున్నారు. దాన్ని ఇప్పుడు అన్నం గొప్పపదం, ‘బువ్వ’ తెలంగాణ తెలివితక్కువ పదం అంటే ఎంత మూర్ఖత్వం?

ఉత్పత్తితో  సంబంధంలేని ఏ భాషకు పదకోశం పెరగదు

బువ్వ డెఫినిట్‌‌‌‌గా సుపీరియర్‌‌‌‌‌‌‌‌ స్పెసిఫిక్‌‌‌‌ పేరు.  ప్రతి తిండి గింజకు ప్రత్యేక పేరివ్వడం, భాష అభివృద్ధి చెందిన లక్షణం.  జొన్నలతో వండిన తిండిని ‘గడ్క’ అనేది శూద్ర ఉత్పత్తి పేరు. దాన్ని ‘జొన్న అన్నం’ అంటే భాషారాహిత్యం. ఉత్పత్తితో  సంబంధంలేని ఏ భాషకు పదకోశం పెరగదు. ఉత్పత్తి క్రమంలోనే  ఉత్పత్తిదారులు కొత్త పదార్థాలకు కొత్త పేర్లు పెట్టుకుంటా పోతారు. 

‘ఇడుపు కాయితం’ బదులు ‘విడాకుల పత్రం’  అని తెలివితక్కువతనాన్ని ,  భాష చరిత్ర తెలవనితనాన్ని  మళ్లా మళ్లా  బయటపెట్టుకోవద్దు. ఉత్పత్తి కులాలు వాడే పదాలే సుదీర్ఘ చరిత్ర పునాది కలవి.  అవే గొప్ప భాషాపర పదాలు. అనువాదాల నుంచి అరువు తెచ్చుకున్నవి కావు.  అవి ప్రజల పంట, మాట, ఉత్పత్తి, పిండోత్పత్తి క్రమంలో  వచ్చినవి.  ప్రాంతాన్ని జోడించి ఆ ప్రాంతంలోని శూద్రుల్ని, దళితుల్ని, ఆదివాసుల్ని అవమానపర్చడం మరీ తెలివితక్కువతనం.  ఆంధ్ర శూద్రులు, దళితులు ఈ భాష వాడరు. 

‘విడాకుల పత్రం’ వాడకూడని పేరు

ఒక పుస్తకానికో,  సినిమాకో  ‘గడ్క కొట్లాట’ అనే పేరుపెడితే  దాన్ని అర్థంచేసుకోలేని  కులం దాన్ని మా కులభాషలోకి అనువదిస్తారా అంటే ఎంత  తెలివితక్కువతనం. ఆ పదం, దాని చరిత్ర నీకు తెలవది, లేదా నీ కులానికి తెలియదు.  అప్పడు తెలుసుకుని అర్థం చేసుకోవాలి. కానీ దానికి ‘జొన్న అన్న పోరాటం’ అని పేరు పెట్టండి అంటే  దాని అర్థమే మారిపోతాది. 

కనుక ‘ఇడుపు కాయితం’ అనే పేరు చరిత్రను,  దానికున్న  స్త్రీ–పురుష సంబంధాల పాజిటివ్‌‌‌‌ కోణం  అధ్యయనం చేసే  ప్రయత్నం చేయకుండా పిచ్చి, పిచ్చి  ప్రశ్నలడిగి ప్రాంతీయ కొట్లాటలు పెడితే ఎట్లా?  ఇకముందు నుంచి భాష గురించి చర్చించేటప్పుడు ప్రాంతం దృక్పథంలో కాదు చూడాల్సింది. ఒక పేరుకు ఉత్పత్తిలో ఎటువంటి సంబంధం ఉన్నదో చూడాలి.  సంస్కృతానికి, ఉర్దూ భాషకు కూడా ఉత్పత్తి పునాది తక్కువ. సంస్కృతానికి అసలు లేదు.  అందుకని  సంస్కృత  అనువాదం  నుంచి పదాలను  తెలుగులో  వాడడమే మానేయాలి.  అందుకే  ‘విడాకుల పత్రం’ అనేది  వాడకూడని పేరు రూపం. ఈ వ్యాసం చదివైనా తెలివి తక్కువ భాష వాదన ఆపండి.

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.