- బహిరంగంగానే ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల అమ్మకాలు
- కన్సల్టెన్సీలు, ప్రైవేట్ కాలేజీల చేతుల్లో డిగ్రీల వ్యాపారం
- రూ.10 వేల నుంచి 15 వేలిస్తే రికార్డులు ఇంటికే
- మొదలైన ఓయూ అధికారుల తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు, కన్సల్టెన్సీల చేతుల్లో కాసులు కురిపించే వ్యాపారంగా మారింది. విద్యార్థులు కష్టపడి చేయాల్సిన రీసెర్చ్ వర్క్‌ను తుంగలో తొక్కి.. పాత విద్యార్థుల ప్రాజెక్టులనే పేర్లు మార్చి కొత్తవారికి బహిరంగంగా అమ్ముతున్నారు. ఇంటర్న్‌షిప్ చేయకపోయినా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కాలేజీలు ఈ దందాకు తెరలేపాయి. ఈ క్రమంలోనే కాలేజీల్లో రికార్డులను పరిశీలించేందుకు ఓయూ అధికారులు గత బుధవారం నుంచి తనిఖీలు మొదలు పెట్టారు. అయితే, వీటిని సరిగ్గా పరిశీలించకుండా.. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కాపీ-పేస్ట్ ప్రాజెక్టుల ధర రూ.15 వేలు..
ఎంబీఏ సెకండియర్‌లో వంద మార్కుల ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థులకు కీలకం. కానీ, చాలా కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, అసలు క్లాసులే నిర్వహించకపోవడంతో విద్యార్థులు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ముఠాలు, కాలేజీ యాజమాన్యాలు పాత రికార్డులనే బయటకు తీసి, కేవలం స్టూడెంట్ పేరు, రోల్ నంబర్ మార్చి కొత్త ప్రాజెక్టుగా కలర్ ఫుల్ బైండింగ్‌తో సిద్ధం చేస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టుకు, ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్‌కు కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మార్కెట్‌లో దొరికే నకిలీ కంపెనీల లెటర్ హెడ్లపై ఇంటర్న్‌షిప్ పూర్తయినట్టు సర్టిఫికెట్లు సృష్టిస్తూ యూనివర్సిటీని బురిడీ కొట్టిస్తున్నాయి. దీంట్లో కొన్ని కాలేజీలకు తెలిసినా పట్టించుకోకపోగా, మరికొన్ని కాలేజీలు ఈ దందాలో భాగస్వాములు అయ్యాయనే ఆరోపణలున్నాయి.
కాలేజీలపై సీజేఎస్ ఫిర్యాదు..
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న 28 కాలేజీలపై సీజేఎస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఇటీవల ఓయూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని సిద్ధార్థ, సుప్రభాత్, జాగృతి, కేజీఆర్, అవంతి, సెయింట్ జేవియర్స్, సెయింట్ జాన్స్, రియా, మ్యాన్ పవర్ డెవలప్‌మెంట్, సెయింట్ విన్సెంట్, సుప్రబాత్, ప్రియదర్శిని, సాన్వీ, పీవీరాంరెడ్డి, అక్షర, విజన్, బ్రైట్, నృపతుంగ, నోబుల్, విజయ, సంస్కృతి, పన్నాల రాంరెడ్డి, కింగ్‌స్టన్, ఓమెగా, గ్లోబల్ తదితర విద్యాసంస్థలపై విచారణ జరపాలని కోరారు. తక్షణమే ఆయా కాలేజీల్లో టీజీసీహెచ్ఈ, ఓయూ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
షో మాత్రమే.. అంతా ఖాళీ..
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెజార్టీ కాలేజీలు కేవలం కాగితాల మీద మాత్రమే నడుస్తున్నాయి. యూనివర్సిటీ తనిఖీలు ఉన్నప్పుడు మాత్రమే హడావుడి చేస్తూ, బయట నుంచి అద్దె ప్రొఫెసర్లను తెచ్చి ఫ్యాకల్టీగా చూపిస్తున్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకపోయినా అటెండెన్స్ ఫీజు వసూలు చేసి వందశాతం హాజరు చూపిస్తున్నాయి. కొన్ని కాలేజీలు కేవలం ఒకరిద్దరు సిబ్బందితోనే నడుస్తున్నాయి. పేపర్ మీద టీచింగ్ ఫ్యాకల్టీ కన్పించిన క్లాసులు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం ఓ కాలేజీని తనిఖీ చేయగా, రూములన్నీ లాక్ చేసి ఉండటం, సిబ్బంది లేకపోవడంతో అసలు విషయం బయటపడింది.
