ఇబ్రహీంపట్నం, వెలుగు: ‘మాకు ఫార్మా వద్దు.. ఫ్యూచర్ వద్దు.. మా భూములే కావాలి’ అంటూ ఫార్మాసిటీ నిర్వాసిత రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో భూసేకరణ సమస్యలపై తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు.
ఈ సభకు జ్యూరీ సభ్యులుగా సీనియర్ అడ్వకేట్ వి.రఘునాథ్, మానవ హక్కుల వేదిక జాతీయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్‌కుమార్, సీనియర్ జర్నలిస్టు వి.వసంతలక్ష్మి, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేపల్లి సుజాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్, రిటైర్డ్ తహసీల్దార్ వి.బాలరాజ్ హాజరయ్యారు. టీపీ జాక్ కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో జరిగిన సభలో తాటిపర్తి, నానక్‌నగర్, కుర్మిద్ద, మేడిపల్లి, మీర్‌ఖాన్‌పేట్ తదితర గ్రామాల రైతులు, రైతు కూలీలు పాల్గొని భూసేకరణ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.
భూసేకరణలో జరుగుతున్న వాస్తవాలను జ్యూరీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు ఫార్మాసిటీ వద్దని, స్వాధీనం చేసుకున్న భూములనే తిరిగి ఇవ్వాలని కోరారు. అనంతరం జ్యూరీ సభ్యులు మాట్లాడుతూ రైతులు వెల్లడించిన అభిప్రాయాలను నివేదికగా రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు నీలం శ్రీవిద్య, నీలం ఝాన్సీ, సంగం చైతన్య, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కానేమోని గణేశ్, సందీప్, కొండల్‌రెడ్డి, నిరంజన్, అచ్చిరెడ్డి, కుందారపు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
