- ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి
నిర్మల్, వెలుగు: హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా మాత్రమే కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నిర్మల్‌లో ఈ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను కేంద్రంగా చేసుకుని దక్షిణాదిలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ వాదనను ముందుకు తెస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్ భౌగోళిక, వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా నివాసానికి అనుకూలంగా ఉండటం, నగర పరిధిలోకి 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం వంటి అంశాలను ఇందుకు అనుకూలంగా చూపుతున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజలు ఫలాలు అందుకుంటున్న సమయంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రతిపాదన వస్తే, రాష్ట్రానికి వచ్చే 60 శాతం ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
హైదరాబాద్‌లోని ఉద్యోగ అవకాశాలు తెలంగాణ ప్రజలకు దూరమవుతాయని అన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్, టీపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు చలపతిరావు, టీజేఏసీ జిల్లా చైర్మన్ విజయకుమార్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు వాజిద్ అహ్మద్ ఖాన్, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న పాల్గొన్నారు.
