- కేసీఆర్ మీద కక్షతో రేవంత్‌రెడ్డి రైతులకు శిక్ష వేస్తున్నడు
- 370 పిల్లర్లు ఉన్న మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే డ్రామా చేస్తున్నరు
- కాళేశ్వరాన్ని వారంపాటు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణను నీళ్లతో తడుపుతం
- లక్ష క్యూసెక్కులు వృథాగా సముద్రంలో కలుస్తున్నయని కామెంట్
- కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
జయశంకర్ భూపాలపల్లి/ జనగామ, వెలుగు: మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్‌ను సంప్రదించి 60 వేల మందితో పంపుహౌస్‌ను ముట్టడించి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కన్నెపల్లి పంపుహౌస్‌ను కేటీఆర్ సందర్శించి.. వ్యూపాయింట్ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి జలాలను పొలాలకు మళ్లించేందుకు కేసీఆర్ కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అప్పట్లో ఉమ్మడి ఏపీ, మహరాష్ట్రతోపాటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు.
ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టు కుదరదని చెప్పిన తర్వాతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని వివరించారు. తుమ్మిడిహెట్టి సామర్థ్యం 16.4 టీఎంసీలు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యం 142 టీఎంసీలని తెలిపారు. 370 పిల్లర్లున్న మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. అవి కూడా ఎన్నికల ముందు కేసీఆర్ ను బద్నాం చేయడానికి కావాలని చేసినట్టు అనుమానంగా ఉందన్నారు. 2 పిల్లర్లు కుంగిన బ్లాక్ మొత్తాన్ని తిరిగి కట్టినా రూ.400 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, అది కూడా ఎల్అండ్ టీ సంస్థ భరిస్తామని ముందుకు వచ్చినా ప్రభుత్వం రిపేర్ చేయకుండా అడ్డుకుంటున్నదని అన్నారు.
రైతులకు రేవంత్‌రెడ్డి శిక్ష వేస్తున్నడు
తెలంగాణకు కాళేశ్వరం వరమైతే సీఎం రేవంత్ రెడ్డి శనిలా దాపురించాడని, కేసీఆర్ మీద కక్షతో రైతులకు శిక్ష వేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. కన్నెపల్లి దగ్గర లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని అన్నారు. కాశేళ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్ కు అప్పగించి.. నలుగురు సీఈలు, డీఈ, ఎస్ఈలను ఇస్తే బాహుబలి మోటార్లతో తెలంగాణకు మళ్లీ జలకళ తెస్తారని చెప్పారు. రైతులకు నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి, పండించిన పంట కొనాలి, కరెంట్ ఇవ్వాలి, మద్దతు ధర, బోనస్ ఇవ్వాలి.. ఇవన్నీ ఇచ్చే తెలివి లేక నీళ్లు లిఫ్ట్ చేయడం లేదని అన్నారు. తెలంగాణ నాశనం అయినా రేవంత్ రెడ్డి చూస్తూనే ఉంటాడని విమర్శించారు. వడ్ల దిగుబడులకు కాళేశ్వరంతో సంబంధం లేకుంటే 2014కు ముందు ఎందుకు తెలంగాణలో రికార్డు స్థాయిలో వడ్లు పండలేదో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది జలసమాధి అయ్యారని, వాళ్ల శవాలు కూడతీయలేదన్నారు. సుంకిశాల రిటర్న్ వాల్ కూలిందన్నారు. ఎన్డీఏస్‌ఏ నీళ్లలో దిగకుండా, సాయిల్ టెస్ట్‌లు చేయకుండా 48 గంటల్లోనే నివేదిక ఇచ్చిందని, దానిమీద తమకు విశ్వాసం లేదన్నారు. ఆయన వెంట శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీలు బోయినిపల్లి వినోద్ కుమార్, మాలోతు కవిత తదితరులున్నారు.
కాంగ్రెస్ సర్కార్.. రైతులను ఇబ్బంది పెడుతోంది : కేటీఆర్
కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పెంబర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. వృథాగా పోతున్న నీటిని చూపెట్టడానికే తాము కన్నెపల్లికి వెళ్తుంటే ముఖ్యమంత్రి తమను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్ సందర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్‌ని జనగాం జిల్లా పెంబర్తి, కొమ్మల టోల్‌గేట్ వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు ఆపేశారు. కేటీఆర్వెంట 3 వెహికల్స్ కు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. దాంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘ముందు మీరు వెళ్లండి, వాటిని తర్వాత పంపిస్తాం’ అని పోలీసులు చెప్పినా ఆయన వినలేదు.
‘‘మేం వెళ్తుంటే ప్రభుత్వానికి భయమెందుకు. నాతో వచ్చే అన్ని వెహికల్స్‌ను పంపిస్తే వెళ్తా. లేకుంటే ఇక్కడే రోడ్డుకు అడ్డంగా వెహికల్ పెట్టి కూర్చుంటా’’ అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పోలీసులతో
పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, బాల్క సుమన్ వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్స్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. కొద్దిసేపటికి పోలీసులు వారిని అనుమతించారు. కాగా, కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
