కుమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్టకు పాలిథిన్‌‌‌‌‌‌‌‌ కవర్లే దిక్కు..ప్రమాదకరంగా పగుళ్లు..వర్షాకాలంతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

కుమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్టకు పాలిథిన్‌‌‌‌‌‌‌‌ కవర్లే దిక్కు..ప్రమాదకరంగా పగుళ్లు..వర్షాకాలంతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
  • నాలుగేళ్లుగా తాత్కాలిక మరమ్మతులతోనే ఆనకట్ట నిర్వహణ
  • నిధుల విడుదలలో జాప్యంపై విమర్శలు
  • శాశ్వత మరమ్మతులు చేయకుంటే ప్రమాదం తప్పదని నిపుణుల హెచ్చరిక

వందల కోట్ల రూపాయలతో నిర్మించిన కుమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్ట ప్రస్తుతం పాలిథిన్‌‌‌‌‌‌‌‌ కవర్ల భరోసాపైనే నిలబడడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పగుళ్లకు తాత్కాలికంగా వేసిన పాలిథిన్‌‌‌‌‌‌‌‌ షీట్లే ఇప్పటికీ రక్షణగా ఉండటం అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండితే ప్రమాదం తప్పదని రైతులు, దిగువ గ్రామాలు ఆందోళన చెందుతున్నారు. సాగునీటితో పాటు మూడు జిల్లాలకు మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ తాగునీటి సరఫరాకు ఆధారమైన ఈ ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. శాశ్వత మరమ్మతులు చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆనకట్టు ఇప్పటికీ పాలిథిన్‌‌‌‌‌‌‌‌ కవర్ల భరోసాపైనే నిలవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రోజులు లేదా వారాల పాటు మాత్రమే చేపట్టే తాత్కాలిక చర్య ఇక్కడ నాలుగేళ్లుగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో భారీ వర్షాల సమయంలో ఆనకట్టపై పగుళ్లు ఏర్పడగా అధికారులు పాలిథిన్‌‌‌‌‌‌‌‌ షీట్లు కప్పి తాత్కాలికంగా ప్రమాదాన్ని నివారించారు. అయితే శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వం ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది.

ఆందోళనకరంగా ఆనకట్ట పరిస్థితి..

నాలుగేళ్ల క్రితం ప్రధాన ఆనకట్టలో పగుళ్లు ఏర్పడి కొంత భాగం కుంగిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత ఆందోళకరంగా మారింది. సుమారు వంద మీటర్ల మేర పగుళ్లు విస్తరించడంతో పాటు కట్ట కుంగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే ఆనకట్టపై ఒత్తిడి పెరిగి ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ శాఖ మాత్రం ఇప్పటికీ సాయిల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ నివేదిక కోసం ఎదురుచూడటమే తప్ప శాశ్వత మరమ్మతుల దిశగా అడుగులు వేయలేదు. నివేదికలు ప్రభుత్వానికి పంపించినా నిధుల మంజూరు జరగకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.

రైతులకు అందని సాగునీరు..

45,500 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కుమ్రంభీం ప్రాజెక్టును నిర్మించారు. కానీ కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో రైతులకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందడం లేదు. మరోవైపు ఇదే ప్రాజెక్టు నుంచి మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ ద్వారా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల జిల్లాల్లో వేలాది గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి కీలక ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడంపై రైతులు ఫైర్​ అవుతున్నారు.

రూ.882 కోట్లకు పెరిగిన వ్యయం..

ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, సిర్పూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల్లోని బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంలో భాగంగా 2005లో 10 టీఎంసీల సామర్థ్యంతో కుమ్రంభీం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 2007లో నిర్మాణం పూర్తయినా కాలువలు పూర్తి కాకముందే 2011 నవంబర్‌‌‌‌‌‌‌‌లో అప్పటి సీఎం కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రారంభంలో రూ.270 కోట్లుగా అంచనా వేసిన వ్యయం.. తర్వాత రూ.882 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు సుమారు రూ.751 కోట్లు ఖర్చు చేశారు. అయినా ఆనకట్ట భద్రత కోసం శాశ్వత మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర విమర్శలు 
వ్యక్తమవుతున్నాయి. 

సాయిల్ టెస్ట్ రిపోర్ట్ రాగానే ముందుకు వెళ్తాం

కుమ్రంభీం ప్రాజెక్ట్  కట్ట పగుళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. దీని పునరుద్ధరణ కోసం ఇప్పటికే పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్)కు పంపించాం. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ఉన్నతాధికారుల సూచనతో ముందుకు వెళ్తాం.

- సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈ , ఆసిఫాబాద్-

భగీరథ తాగునీటికీ ముప్పు...

జిల్లాలో సాగునీటితో పాటు తాగునీటికి కూడా కుమ్రంభీం ప్రాజెక్టే ప్రధాన ఆధారం. ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీటిని మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ ద్వారా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల జిల్లాల్లోని వేలాది గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. వరదలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి 10 టీఎంసీల సామర్థ్యానికి చేరితే ఆనకట్టపై ఒత్తిడి పెరిగి ప్రమాదం తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 60 శాతం నీటి సామర్థ్యమే కొనసాగుతుండగా, ఆనకట్ట పగుళ్లు మరింత తీవ్రరూపం దాల్చాయి. శాశ్వత మరమ్మతులు చేపట్టకపోతే సాగునీటికే కాదు, తాగునీటి సరఫరాకూ తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలిథిన్‌‌‌‌‌‌‌‌ కవర్లతో కాకుండా పటిష్ఠమైన మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.