మజ్లిస్ అంటే భయమా.. ప్రేమా? ఒవైసీ కాలేజీ విషయంలో మౌనం ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మజ్లిస్ అంటే భయమా.. ప్రేమా? ఒవైసీ కాలేజీ విషయంలో మౌనం ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • హైడ్రా అంటే సామాన్యులకేనా? 
  • బడా నేతలకు కాదా? అని నిలదీత

హైదరాబాద్, వెలుగు: మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సామాన్య ప్రజల జీవితాలను బలిపెడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమా.. ప్రేమా? లేక రెండూ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో స్పందించారు.

రియల్ ఎస్టేట్ కమీషన్ల కోసం ఆరాటపడుతున్న ప్రభుత్వం.. ఎంఐఎం నేతల అక్రమ కట్టడాల జోలికి వెళ్లేందుకు వణికిపోతోందన్నారు. హైడ్రా పనితీరు సెలక్టివ్ గవర్నెన్స్ కు నిదర్శనమన్నారు. సామాన్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. సల్కం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌‌లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బారిష్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ఈ విషయంలో హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుని చీవాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో మార్పులేదన్నారు.

హైడ్రా సహా పలు శాఖల నుంచి వివరాలు కోరినా..  ప్రజల విషయంలో చూపే తొందరపాటును ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం చూపించడం లేదని విమర్శించారు. మజ్లిస్ పార్టీని యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా ప్రభుత్వం భావిస్తోందని, ఇది సరికాదని చెప్పారు. హైడ్రాతో పేద ముస్లింల ఇండ్లు కూడా కూల్చేశారని, అయినా, వారి తరఫున మజ్లిస్, కాంగ్రెస్ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అనే సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.