పంపులు ఆన్ చేయలేం.. నీటిని స్టోర్ చేస్తే భద్రాచలం సహా 44 ఊర్లు కొట్టుకుపోతయ్ : మంత్రి ఉత్తమ్

పంపులు ఆన్ చేయలేం..  నీటిని స్టోర్ చేస్తే భద్రాచలం సహా 44 ఊర్లు కొట్టుకుపోతయ్ : మంత్రి ఉత్తమ్
  • కాళేశ్వరం మూడు బ్యారేజీల పునాదులూ బలహీనమే
  • కన్నెపల్లి నుంచి అన్నారంలోకి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు
  • బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యేదాకా వాడుకోవద్దని ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ చెప్పింది
  • మేడిగడ్డది ఒక్క పిల్లర్​.. ఒక్క గేటు సమస్య కాదు
  • నీటిని స్టోర్​ చేస్తే భద్రాచలం సహా 44 ఊర్లు కొట్టుకుపోతయ్​
  • 2027 జులై నాటికి బ్యారేజీలను పునరుద్ధరిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీల పంపులు ఆన్​చేయడం సాధ్యం కాదని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీలకు రిపేర్లన్నీ పూర్తయ్యే వరకు 3 బ్యారేజీలను వాడుకోరాదని నేషనల్ ​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ) స్పష్టంగా చెప్పిందన్నారు. కాబట్టి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే నిర్ణయం తమ ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోదని తేల్చి చెప్పారు. ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏకి ఏం తెలియదన్నట్టుగా కేటీఆర్​ మాట్లాడుతున్నారని, ఆయన చెప్పినట్టు 
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదని తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వకు షూటబుల్​ కాదని ఎన్‌‌‌‌డీఎస్‌‌ఏ చెప్పిందన్నారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతున్నాయి కాబట్టి ఎత్తిపోయాలని కేటీఆర్​ అంటున్నారని, కానీ, ఆ నీళ్లను ఎత్తిపోసేది అన్నారం బ్యారేజీలోకేనని, ఆ బ్యారేజీ ఫౌండేషన్​అసలు బాలేదని ఎన్‌‌డీఎస్‌‌ఏ చెప్పిందని గుర్తు చేశారు. కన్నెపల్లి పంప్​హౌస్​ స్విచ్ఛాన్‌‌ చేసి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నీటిని ఎత్తిపోసే వీలు లేదన్నారు.

ఆదివారం సెక్రటేరియెట్‌‌లో ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత నిర్లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్ట్​ కాళేశ్వరమని పేర్కొన్నారు. 3 బ్యారేజీల రిపేర్లకు కట్టుబడి ఉన్నామని, ఎన్‌‌డీఎస్‌‌ఏ రిపోర్ట్​ మేరకే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆ అథారిటీ చెప్పనిదే నీళ్లను ఎత్తిపోయబోమన్నారు. కాళేశ్వరం 
ప్రాజెక్టులోని 3 బ్యారేజీల పునాదులు బలహీనంగా ఉన్నాయన్న అనుమానాలను ఎన్‌‌డీఎస్‌‌ఏ వ్యక్తం చేసిందన్నారు. డిజైన్​ మంచిగా లేదని, డ్యామ్​సేఫ్టీ పట్టించుకోలేదని, నిర్మాణ లోపాలున్నాయని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్‌‌‌‌ఎస్​ వాళ్లేనని, కూలిపోయిందీ వాళ్ల హయాంలోనేనని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా రిపేర్లు చేస్తున్నామని చెప్పారు. 2027 జులై నాటికి 3 బ్యారేజీలకు పరీక్షలు చేసి రిపేర్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.  

ఇది ఒక్క పిల్లర్​ సమస్య కాదు

మేడిగడ్డ బ్యారేజీది ఒక్క పిల్లర్​.. ఒక్క గేటు సమ స్య కాదని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. మొత్తం బ్యారేజీ భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన సమస్య అని వివరించారు. గేట్లు మూసి నీటిని స్టోర్​ చేస్తే.. బ్యారేజీ మొత్తం కూలిపోయి దిగువన భద్రాచలంసహా 44  గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు.  స్వార్థం, అత్యాశ, సాంకేతిక రాజీల ఫలితమే నేటి కాళేశ్వరం సంక్షోభమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లపాటు బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వం ఇరిగేషన్​ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఇరిగేషన్‌‌పై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కాళేశ్వరం కూలిపోయిందని, పాలమూరు– రంగారెడ్డితో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని, దేవాదుల ప్రాజెక్టు పూర్తి కాలేదని అన్నారు. తాము  అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్​ శాఖను గాడిలో పెడుతున్నామని చెప్పారు.

కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్​ స్పష్టం చేశారు. మూడు బ్యారేజీలపై గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్, హైడ్రాలిక్ మోడలింగ్, కంప్యూటేషనల్ ఫ్లుయిడ్ డైనమిక్స్, డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లులాంటి అత్యాధునిక పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. సీడబ్ల్యూసీ, ఎన్‌‌డీఎస్‌‌ఏ పర్యవేక్షణలో సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్​, ఆఫ్రీ సంస్థలు కలిసి బ్యారేజీల పునరుద్ధరణపై పనిచేస్తున్నాయని తెలిపారు. 2027 జులై నాటికి బ్యారేజీలను పునరుద్ధరిస్తామన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్‌‌లను ఖరారు చేసి, వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. బ్యారేజీలను డయాఫ్రమ్​ వాల్‌‌తో పటిష్టం చేస్తామని తెలిపారు. 

పైసలు తిన్నరు..  

తుమ్మిడిహెట్టిని పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఎల్‌‌నినో వచ్చినా ఉత్తర తెలంగాణకు ఇబ్బందులు వచ్చేవి కాదని మంత్రి ఉత్తమ్​ కుమార్‌‌‌‌ రెడ్డి అన్నారు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టునైనా మంచిగా కట్టి ఉంటే వాడుకునేవాళ్లమన్నారు. పైసలు తిని మొత్తం ప్రాజెక్టును లోపాలమయంగా కట్టారని మంత్రి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టిపై ముందుకే వెళ్తామని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్​తో మాట్లాడుతామని ఆయన చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు 30 శాతం (రూ.11 వేల కోట్లు) ఖర్చు పెట్టిన తర్వాత.. అనాలోచిత నిర్ణయం తీసుకుని దాన్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేశారన్నారు. రూ.38 వేల కోట్లతో అయ్యే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును.. కాళేశ్వరం పేరుతో లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2018లో సెంట్రల్​ వాటర్​ కమిషన్​ అప్రూవల్ వచ్చినా.. 2016 లోనే కాంట్రాక్టర్లతో ప్రాజెక్టు గురించి అన్ని ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ‘‘మీరు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఉత్తర తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఎల్​నినోతో వర్షాభావ పరిస్థితులు ఉండబోతున్నయ్​. అందుకు తగ్గట్టుగా పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ చెబుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంత కరెంట్‌‌ను వినియోగిస్తారో.. కాళేశ్వరం  ప్రాజెక్టుకు కూడా అంత కరెంట్ కావాలని కాగ్​ రిపోర్ట్​చెప్పింది. అన్ని పంపులు నడిస్తే 8,450 మెగావాట్ల కరెంట్​ అవసరమైతుంది. మేడిగడ్డ బ్యారేజీని కట్టిన కొన్ని రోజులకే లీకేజీలు ఏర్పడ్డాయి. కానీ, దానిని 
అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు’’ అని వివరించారు.