న్యూఢిల్లీ: హోమ్ లోన్లను బాండ్లు లేదా సెక్యురిటీలుగా మార్చి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు అమ్మే ఎన్‌బీఎఫ్‌సీ ‘ఆర్‌ఎంబీఎస్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఆర్‌డీసీఎల్)’ లో 10 శాతం వాటాను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుంచి ఎస్‌బీఐ కొనుగోలు చేయనుంది. ఈ లావాదేవీ తర్వాత, ఆర్‌డీసీఎల్‌లో ఎన్‌హెచ్‌బీ వాటా 39శాతం నుంచి 29శాతానికి తగ్గుతుంది. ఆర్‌డీసీఎల్ బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మోర్టగేజ్ ఉన్న హోమ్ లోన్లను ఒక పూల్ (సమూహం) గా చేసి, వాటిని మార్కెట్లో ట్రేడింగ్ చేయదగిన బాండ్లు లేదా సెక్యూరిటీలుగా మార్చి ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా పెన్షన్ ఫండ్లకు అమ్ముతోంది.
దీంతో సంబంధిత బ్యాంక్‌కు హోమ్ లోన్ల దగ్గర నిలిచిపోయిన నగదు ఫ్రీ అవుతుంది. వీటిని కొనుగోలు చేసిన ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్‌కు వడ్డీల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ ఆర్‌డీసీఎల్‌లో ఎల్‌ఐసీ 10శాతం వాటాను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ చెరో 7శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఆదిత్య బిర్లా, టాటా క్యాపిటల్, ట్రూహోమ్, గృహమ్, హీరో, ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ వంటి సంస్థలు కూడా చెరో 5శాతం వాటాను హోల్డ్ చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల గ్రోత్ కంటే లోన్ల డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో లాక్ అయి ఉన్న హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియోలను నగదు రూపంలోకి మార్చుకోవడానికి సెక్యూరిటైజేషన్ ప్రక్రియ బ్యాంకులకు ఎంతో సహాయపడుతుంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం రిటైల్ హోమ్ లోన్ల బకాయిల విలువ రూ.44.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో ఎస్‌బీఐ వాటా రూ.9.44 లక్షల కోట్లుగా ఉంది.
