- 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన
- గైడ్స్ లైన్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో మ్యాథ్స్, సైన్స్ బోధనను మరింత సులభతరం చేసేందుకు విద్యాశాఖ ఖాన్ అకాడమీ సహకారంతో స్టెమ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ అమలు చేయనుంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించేందుకు 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. రాష్ట్రంలోని జడ్పీ హైస్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లోని ఐఎఫ్‌పీ స్క్రీన్లు, కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఈ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అమలు కానుంది.
ప్రతి పాఠశాలలో ఈ-క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించాలని ఆదేశించారు. సోమవారం నుంచి శనివారం వరకు షెడ్యూల్ ప్రకారం మ్యాథ్స్, సైన్స్ వీడియో పాఠాలతో పాటు ఆన్‌లైన్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులకు బోధనలో తోడ్పాటుగా ఖాన్ మిగో ఏఐ టూల్‌ను వినియోగిస్తారు. కార్యక్రమం అమలును హెడ్‌మాస్టర్లు ప్రతి వారం, ఎంఈఓలు 15 రోజులకోసారి, జిల్లా కలెక్టర్లు ప్రతి నెలా సమీక్షిస్తారు. వరుసగా రెండు వారాలు డిజిటల్ క్లాసులు నిర్వహించని పాఠశాలలపై, బాధ్యులైన టీచర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నవీన్ నికోలస్ హెచ్చరించారు.
