- ఇకపై డీబీటీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రతి నెల ఒకటో తారీఖునే వేతనాలు అందేలా చర్యలు చేపట్టింది. వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త విధానంలో భాగంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హానరేరియం ఉద్యోగుల వేతనాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఈ నెల నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఆరోగ్య శాఖలోని మెజార్టీ ఉద్యోగుల ఖాతాల్లో ఒకటో తేదీనే జీతాలు జమయ్యాయి.
నేడు టీవీవీపీ ఉద్యోగులకు
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని సుమారు 1,700 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తొలిసారి డీబీటీ ద్వారా జీతాలు ఇస్తున్నారు. మొదటిసారి కావడంతో కొన్ని సాంకేతిక కారణాల వల్ల వీరికి జీతాల జమ ఆలస్యమైంది. ఇప్పటికే ఆర్థిక శాఖ బిల్లులకు ఆమోదం తెలపడంతో.. సోమవారం వీరి ఖాతాల్లో వేతనాలు జమ కానున్నాయి.
