- ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థల వ్యవహారంపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, వెలుగు: ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థల భవనాలను కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంఐఎం శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. విద్యాసంస్థలపై అన్యాయంగా చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని, విద్యాసేవలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క విద్యా సంస్థ భవనాలను కూల్చివేస్తే.. వంద విద్యా సంస్థలను నిర్మిస్తామన్నారు.
ఎలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదని, ఇలాంటి పరిస్థితులను గతంలోనూ ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. తమ విద్యా సంస్థలను ఎలా కాపాడుకోవాలో తెలుసన్నారు. అరెస్ట్‌లు, జైలు, తల్వార్లు, తుపాకీ తూటాలు తనకు కొత్తకాదని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదన్నారు.
ఫాతిమా ఒవైసీఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సంబంధించిన భూ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. సలకం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖలు సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. అలాగే కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
