ఆన్‌‌లైన్‌‌లోకి విద్యాశాఖ ఉద్యోగుల సర్వీస్ రికార్డులు

ఆన్‌‌లైన్‌‌లోకి విద్యాశాఖ ఉద్యోగుల సర్వీస్ రికార్డులు
  • వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌‌లో స్పెషల్ క్యాంపులు 

హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను స్కాన్ చేసి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఆర్ఎస్)లో నిక్షిప్తం చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనిలో భాగంగా మండలం నుంచి సెక్రటేరియెట్ వరకు అన్ని ఆఫీసుల వివరాలతో కూడిన ఆఫీస్ మాస్టర్‌‌‌‌ను రూపొందించి, పోస్టుల మ్యాపింగ్, ఉద్యోగుల వివరాలను డిజిటలైజ్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ డిజిటల్ ఆర్గనోగ్రామ్‌‌తో ఉద్యోగుల ట్రాకింగ్, బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మరింత వేగంగా, జవాబుదారీతనంతో సాగనుంది. ఈ డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యాశాఖ వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌‌లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. జులై 4న హైదరాబాద్ జోన్ లోని జిల్లాలు, జులై 5న వరంగల్ జోన్ పరిధిలోని అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి జిల్లా నుంచి ఏపీవో, ఏఎస్ఓతో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ క్యాంపులకు వచ్చి, పని పూర్తయ్యే వరకు అక్కడే ఉండి డేటా అప్‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది.