విమెన్స్ టీ20 విజేత ఆస్ట్రేలియా.. ఏడోసారి వరల్డ్‌‌ కప్‌‌ సొంతం.. ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు

విమెన్స్ టీ20 విజేత ఆస్ట్రేలియా.. ఏడోసారి వరల్డ్‌‌ కప్‌‌ సొంతం.. ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు
  • ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌కు చెక్‌‌
  • రాణించిన బెత్‌‌ మూనీ, లిచ్‌‌ఫీల్డ్‌‌

లండన్: బ్యాటింగ్‌‌లో చెలరేగిన ఆస్ట్రేలియా విమెన్స్‌‌ జట్టు.. రికార్డు స్థాయిలో ఏడోసారి టీ20 వరల్డ్‌‌ కప్‌‌ను సొంతం చేసుకుంది. ఛేజింగ్‌‌లో బెత్‌‌ మూనీ (49 బాల్స్‌‌లో 10 ఫోర్లతో 64), ఫోబీ లిచ్‌‌ఫీల్డ్‌‌ (35 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 48) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్‌‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌ విమెన్స్‌‌ జట్టుకు చెక్‌‌ పెట్టింది.

విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్స్ చరిత్రలో ఇది రికార్డు ఛేజింగ్‌‌ కావడం విశేషం. టాస్‌‌ ఓడిన ఇంగ్లండ్‌‌ 20 ఓవర్లలో 150/4 స్కోరు చేసింది. సివర్‌‌ బ్రంట్‌‌ (58 నాటౌట్‌‌), ఫ్రెయా క్యాంప్‌‌ (44 నాటౌట్‌‌) రాణించారు. తర్వాత ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 153/3 స్కోరు చేసి నెగ్గింది. ఇన్నింగ్స్‌‌ రెండో ఓవర్‌‌లోనే జార్జియా వోల్‌‌ (9)ను లారెన్‌‌ బెల్‌‌ (1/38) ఔట్‌‌ చేసింది. 17/1తో ఇబ్బందుల్లో పడ్డ ఇన్నింగ్స్‌‌ను మూనీ, లిచ్‌‌ఫీల్డ్‌‌ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు.

భారీ షాట్లకు పోకుండా నెమ్మదిగా ఆడుతూ వీలైనప్పుడల్లా బౌండ్రీలతో స్కోరు పెంచారు. ఈ క్రమంలో రెండో వికెట్‌‌కు 100 రన్స్‌‌ జత చేశారు. 13వ ఓవర్‌‌లో లిచ్‌‌ఫీల్డ్‌‌ను చార్లీ డీన్‌‌ (1/28) పెవిలియన్‌‌కు పంపినా.. మూనీ మాత్రం చివరి వరకు క్రీజులో నిలిచింది. ఎలైస్‌‌ పెర్రీ (13), ఆష్లే గార్డెనర్‌‌ (3 నాటౌట్‌‌)తో కలిసి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మూనీకి ‘ప్లేయర్ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి.  

బౌలర్లు అదుర్స్‌‌‌‌‌.. 

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ను కట్టడి చేయడంలో ఆసీస్‌‌ బౌలర్లు సూపర్‌‌ సక్సెస్‌‌ అయ్యారు. సోఫీ మోలినెక్స్ (1/32), కిమ్ గార్త్ (1/20), అన్నాబెల్ సదర్‌‌లాండ్ (1/34), లూసీ హామిల్టన్‌‌ (1/19) వికెట్లు తీయడంతో పాటు రన్స్‌‌ కట్టడి చేశారు. ఆసీస్ బౌలర్ల ఆధిపత్యం ఎంతలా సాగిందంటే.. ఇంగ్లండ్ బ్యాటర్లు మొత్తం ఇన్నింగ్స్‌‌లో కేవలం రెండే రెండు సిక్సర్లు కొట్టారు.

రెండో ఓవర్‌‌లో అమీ జోన్స్‌‌ (6), ఐదో ఓవర్‌‌లో డ్యానీ వ్యాట్‌‌ హోడ్జ్‌‌ (8)ని ఔట్‌‌ చేశారు. 32/2తో కష్టాల్లో పడిన ఇంగ్లిష్‌‌ జట్టును సివర్‌‌ బ్రంట్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌తో ఆదుకుంది. అలైస్‌‌ క్యాప్సీ (23)తో మూడో వికెట్‌‌కు35, చివర్లో క్యాంప్‌‌తో కలిసి ఐదో వికెట్‌‌కు 80 రన్స్‌‌ జోడించింది. హీథర్‌‌ నైట్‌‌ (2) విఫలమైంది.