ఆదాయంలో బెంగళూరు, చండీగడ్‌‌‌‌, ఢిల్లీ టాప్‌‌‌‌..మిడిల్‌క్లాస్ ఎక్కువగా ఉన్న సిటీ  హైదరాబాద్‌

ఆదాయంలో బెంగళూరు, చండీగడ్‌‌‌‌, ఢిల్లీ టాప్‌‌‌‌..మిడిల్‌క్లాస్ ఎక్కువగా ఉన్న సిటీ  హైదరాబాద్‌
  • ధనవంతులకు అడ్డా..ఢిల్లీ, ముంబై, పుణె 
  • 2030 నాటికి టాప్ 100 నగరాల్లో  కటిక పేదరికం ఉండదు : ప్రైస్‌‌‌‌–టాటా సన్స్ రిపోర్ట్‌‌‌‌

న్యూఢిల్లీ:  దేశంలోని ఇతర సిటీలతో పోలిస్తే బెంగళూరు, చండీగడ్‌‌‌‌, ఢిల్లీలలో కుటుంబాల సగటు ఆదాయం చాలా ఎక్కువగా ఉంది.   ఢిల్లీ, చండీగఢ్, తిరువనంతపురం, వడోదరలలో ఖర్చు ఎక్కువగా జరుగుతోంది.   భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాలు ( ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌‌‌‌కతా, చెన్నై, హైదరాబాద్) దేశవ్యాప్తంగా జరిగే మొత్తం వినియోగంలో  46 శాతం వాటాను కలిగి ఉన్నాయని   డేటా  అనలిటిక్స్ సంస్థ ప్రైస్‌‌‌‌, టాటా సన్స్ కలిసి  రూపొందించిన "మెనీ అర్బన్ ఇండియాస్" రిపోర్ట్ పేర్కొంది.

దేశంలోని మొత్తం పట్టణ ప్రాంతాల వినియోగంలో దాదాపు మూడింట రెండు వంతులు ఈ ఆరు నగరాల నుంచే వస్తోందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఖర్చులో ఢిల్లీ ఎన్‌‌‌‌సీఆర్ అతిపెద్ద హబ్‌‌‌‌గా మారింది.   ఏడాదికి 126 బిలియన్‌‌‌‌ డాలర్ల (దాదాపు రూ.12 లక్షల కోట్ల) విలువైన వినియోగం ఇక్కడ జరుగుతోందని అంచనా. ఇది ముంబై, బెంగళూరు నగరాల ఉమ్మడి ఖర్చుల  (దాదాపు రూ.12.86 లక్షల కోట్ల) కు దాదాపు సమానంగా ఉంది.  ముంబైలో 46 లక్షల కుటుంబాలు ఉండగా, ఢిల్లీ ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌లో ఏకంగా 75 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి.

జనాభా ఎక్కువగా ఉండడంతో వినియోగం కూడా ఎక్కువగా జరుగుతోంది.  ఢిల్లీ ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌లోని కుటుంబాలు కేవలం రవాణా  కోసమే ఏటా 33 బిలియన్‌‌‌‌ డాలర్ల (దాదాపు రూ.3.16 లక్షల కోట్ల) కు పైగా ఖర్చు చేస్తున్నాయి. ఇది పుణె లేదా అహ్మదాబాద్ నగరాల మొత్తం ఖర్చుల కంటే ఎక్కువ కావడం గమనార్హం.  ప్రైస్, టాటా సన్స్ కలిసి  2025-–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అంచనాలను రూపొందించాయి. 

టాప్ 100 సిటీలు

దేశంలోని టాప్ 100 సిటీలలో దేశ జనాభాలో ఐదో వంతు కంటే తక్కువ మంది  మాత్రమే నివసిస్తున్నప్పటికీ, దేశ మొత్తం ఆదాయంలో మూడో వంతు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ నగరాలే సృష్టిస్తున్నాయి. అలాగే మొత్తం వినియోగంలో 31శాతం వాటాను కలిగి ఉన్నాయి.  ఈ సిటీలను నాలుగు రకాలుగా ప్రైస్‌‌‌‌, టాటా సన్స్ రిపోర్ట్ వేరు చేసింది.

బిగ్ సిక్స్ : ఒక కోటికి పైగా జనాభా ఉన్న సిటీలు. ఇక్కడ సగటు వార్షిక కుటుంబ ఆదాయం రూ. 23 లక్షలు.
బూమ్‌‌‌‌టౌన్స్ : అహ్మదాబాద్, జైపూర్, సూరత్, పుణె లాంటి సిటీలు (జనాభా 25 లక్షల నుంచి 1 కోటి). ఇక్కడ సగటు వార్షిక ఆదాయం రూ. 17 లక్షలు.
బ్రేక్అవుట్ సిటీస్: 15 నుంచి 25 లక్షల జనాభా ఉన్న సిటీలు. ఇక్కడ సగటు వార్షిక ఆదాయం రూ. 14 లక్షలు.
ఫ్రంటియర్ సిటీస్: 5 నుంచి 15 లక్షల జనాభా ఉన్న సిటీలు. ఇక్కడ సగటు వార్షిక ఆదాయం రూ. 12 లక్షలు.

జనాభాలో మధ్యతరగతి వాటా 53 శాతం

1 దేశ జనాభాలో ఏటా రూ. 6 లక్షల నుంచి రూ. 36 లక్షల వరకు సంపాదించే మధ్య ఆదాయ వర్గాల  వాటా గత పదేళ్లలో 29శాతం నుంచి 53శాతానికి పెరిగి దాదాపు రెట్టింపు అయింది. 2030 నాటికి టాప్ 100 నగరాల్లో ఈ వాటా 60శాతానికి చేరుకోనుంది. ప్రస్తుతం ఈ విభాగంలో హైదరాబాద్  అత్యధిక వాటాతో అగ్రస్థానంలో ఉంది.

2 ఏడాదికి రూ. 36 లక్షల కంటే ఎక్కువ సంపాదించే ఉన్నత ఆదాయ వర్గాల  వాటా గత పదేళ్లలో 3శాతం నుంచి 12శాతానికి పెరిగింది. ఇది 2030 నాటికి 20శాతానికి చేరొచ్చని అంచనా. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పుణె సిటీలు ఈ విభాగంలో ముందుండగా.. రాయ్‌‌‌‌పూర్, తూత్తుకుడి, కన్నూర్ వంటి సిటీలు ఈ విభాగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి.

3 ఏడాదికి రూ. 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల (కటిక పేదరికం)  సంఖ్య 2030 నాటికి టాప్ 100 నగరాల్లో దాదాపుగా జీరో స్థాయికి తగ్గుతుందని   (జనాభాలో 0.3 శాతానికి పడిపోతుందని) రిపోర్ట్‌‌‌‌ అంచనావేసింది.