తెలుగులో.. తొలి ఫెమినిస్ట్ నాటకం..115 సంవత్సరాల క్రితం రాసిన కనక్తార నాటకం ప్రదర్శన

తెలుగులో..  తొలి ఫెమినిస్ట్ నాటకం..115 సంవత్సరాల క్రితం రాసిన కనక్తార నాటకం ప్రదర్శన

రాజులు మారినా, రాజ్యాలు కూలినా ఆధునిక ప్రపంచంలో స్త్రీ హింస తప్పడం లేదు. అన్యాపదేశంగా చందాల కేశవదాసు 115 సంవత్సరాల క్రితం రాసిన “కనక్తార”నాటకం ఇటీవల ప్రదర్శించారు. ఆయన 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ‘సురభి’ నాటక సమాజం కేశవదాసు జన్మించిన ఖమ్మంలో నాటక ప్రదర్శన జరిగింది.  ఈ నాటకం రాసే నాటికి రచయిత వయసు 35 ఏళ్లు. 

చందాల కేశవదాసు “కనక్తార” నాటకం చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రచయిత తెలంగాణ యాసను, భాషను ప్రవేశపెట్టిన తొలి నాటకంగా కూడా చరిత్ర సాహిత్య పుటల్లో నిలుస్తుంది.1911లో పద్య నాటకంగా పురుడు పోసుకున్న ఈ నాటకం అచ్చు ప్రతి 30 సార్లు పునర్ముద్రణ పొందింది.. అంటే దాని ప్రశస్థి ఇట్టే అర్థం అవుతుంది. 

నాటక సమాజాలకు ప్రతిష్టాత్మక నాటకమే కాక ఈ కథ (1937,1956) రెండుసార్లు సినిమాగా వచ్చింది. నేటికీ సురభి కళాబృందం ప్రదర్శనల్లో ఈ నాటకానికి చోటుంది. “కనక్తార” నాటకం ఇతివృత్తం సూరసేన మహారాజు, ఆయన తమ్ముడు ఉగ్రసేనుడుదే. ఉగ్రసేనుడు చెడు వ్యసనాలకు బానిసకావడం, రాజ్యంలోని సాధారణ కుటుంబ స్త్రీలను చెరబట్టడం, ప్రశ్నించిన రాజును కుట్రతో చంపడం, రాజు భార్య వదినను చెరబట్టడం, రాజు కుమారుడు కనకసేనుడు, కుమార్తె తారాదేవిని హతమార్చాలని ఆదేశించడం. 

రాజుభార్య ఆ దుష్టుడు చెరనుంచి తప్పించుకుని తటాకంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం, రాజకుమారులను చంపకుండా భటులు అడవిలో వదిలేయడం. తిరిగి వారిద్దరు తప్పిపోవడం, క్రూరమృగం బారి నుంచి రాణిని ఓశెట్టి కాపాడి దాసిగా చేసుకోవడం, కనకసేనుడు మరో రాజ్యం రాజుగా మారడం, విచారణ సందర్భంగా తల్లిని గుర్తించడం, అక్కను అడవిలో వెతికి పట్టుకుని పూర్వ రాజ్యం కోసం ఉగ్రసేనుడిపై దండెత్తి బందీగా పట్టుకోవడం, ఎన్ని హింసలు పెట్టినప్పటికీ రాజమాత తన మరిది ఉగ్రసేనుడికి మరణశిక్ష నుంచి క్షమాభిక్ష పెట్టడం.. ఇది స్థూలంగా కథ! 

సురభి కళాబృందం తమ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఓ అద్భుతమైన ప్రదర్శనగా ఆద్యంతంఆసక్తికరంగా నాటకం ప్రదర్శించినప్పటికీ చిత్రంగా స్త్రీ హింస, పురుషాహంకారం, వాటి ప్రతిఘటన ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఉగ్రసేనుడు అకృత్యాలను ప్రశ్నించినందుకు మంత్రి, సైన్యాధిపతిని హతమార్చడం, సూరసేనుని గృహంలో నిద్రిస్తున్న సమయంలో హతమార్చడం, రాజు భార్య, ఇద్దరు పసిపిల్లలను చెరబట్టే సన్నివేశంలో స్త్రీ హింసను చూపిస్తారు. ఫెమినిస్ట్​ ఉద్యమాలు వచ్చిన70 ఏళ్లకు ముందే కనక్తార నాటకంలో కేశవదాసు ఫెమినిజాన్ని చాలా పెద్ద స్థాయిలో చూపించారు. 

ఉగ్రసేనుడు తన వదినను ఆశించిన సమయంలో ఓ స్త్రీగా యజమాని ప్రాణాలు కాపాడుకునే సన్నివేశంలో ఒక్కొక్క మాట సమాజంపై పేల్చిన తూటాలే అని చెప్పక తప్పదు. మహారాణి తటాకంలో దూకి ఆత్మహత్య చేసుకునే సన్నివేశంలో ఆకాశవాణి సందేశం నేటి ఆత్మహత్య లకు మేల్కొలుపు అని చెప్పొచ్చు. తటాకం నుంచి జాలర్లు ఆపదలో ఉన్న రాణిని రక్షించిన తర్వాత ఆ జాలర్ల మధ్య సంభాషణ, పురుషాహకారం స్వరూపం, స్త్రీ వ్యామోహాన్ని బట్టబయలు చేసిన సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారు. 

ఈ సందర్భంగా పురుషాధిక్య సమాజంలో ఒంటరిగా దొరికిన స్త్రీలను ఎలా భావిస్తారో రచయిత కళ్లకు కట్టారు. నాటకం ఆద్యంతం ప్రతి డైలాగ్​లో స్త్రీ అణచివేత రూపాలు, తిరుగుబాటు సన్నివేశాలు కనిపిస్తాయి. రాణి జాలరుల నుంచి తప్పించుకుని పోవడం, అడవిలో క్రూరమృగాలు దాడి, ఓ వ్యాపారి కాపాడి రక్షించడం, అసందర్భంగా వారిద్దరి మధ్య సన్నివేశం డైలాగ్​లలో కూడా స్త్రీ నిస్సహాయత, అనుమానాలు, వేధింపులు ఎలా ఉంటాయో చూపించారు.

 శెట్టి కుమారుడి మరణం తర్వాత ఆ అభియోగం దాసీగా మారువేషంలో ఉన్న రాణిపై మోపడం, తిరిగి కుమారుడు కనకసేనుడు రాజదర్బారులో విచారణ జరపడం, అడవిలో స్పృహ కోల్పోయిన తారాదేవి దొంగల చేతికి చిక్కడం ఈ సందర్భంగా జరిగిన సంభాషణలన్నింటా రచయిత కేశవదాసు స్త్రీవాద కోణాల్ని అద్భుతంగా చిత్రించాడు. 

కనకసేనుడు తమ పూర్వ రాజ్యం పినతండ్రి ఉగ్రసేనుడుపై దండయాత్ర చేసి బంధించి తల్లి ముందు ప్రవేశపెట్టినప్పుడు, స్త్రీ ఎంత సహనమూర్తో చివరి డైలాగ్​ల ద్వారా రచయిత చూపించారు. తన భర్తను చంపి కుటుంబాన్ని అడవులపాలు చేసిన ఉగ్రసేనుడికి క్షమాభిక్ష పెట్టి మరణశిక్ష నుంచి తప్పించడంతో కథ ముగుస్తుంది.

చాలా చిత్రంగా, ఆధునిక కాలానికి కూడా అందనంత స్పష్టంగా “కనక్తార” నాటకంలో చందాల కేశవదాసు స్త్రీ హింస, పురుషాదిక్యత, స్త్రీ తిరుగుబాటు, అంతిమంగా స్త్రీ సహనం.. ఇత్యాది అంశాలన్నీ పొందుపరచడం ఆశ్చర్యం వేస్తుంది.ఇలాంటి చందాల కేశవదాసుకు తొలితరం సంఘ సంస్కర్తల వరుసలో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేశవదాసు కుటుంబం, ఇన్నాళ్లు కనక్తార నాటకం ప్రజల్లో నిలబెట్టిన సురభి కళాబృందాలకు సముచిత గౌరవం ఇవ్వాలి. కనక్తార.. కాలాన్ని జయించిన నాటకం. 

- ఎన్. తిర్మల్-

లైఫ్​ & లిటరేచర్​ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com