E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గిందా? రిపేర్ ఖర్చులు పెరిగాయా? సర్వేలో బయటపడ్డ నిజాలు

E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గిందా? రిపేర్ ఖర్చులు పెరిగాయా? సర్వేలో బయటపడ్డ నిజాలు

పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపించుకుని కారు, బైక్ నడిపిన తర్వాత మైలేజ్ ఒక్కసారిగా తగ్గిపోయిందా? తరచూ సర్వీసింగ్ అవసరం వస్తోందా? అయితే మీరు ఒక్కడే కాదు. దేశవ్యాప్తంగా వేలాది మంది వాహనదారులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన E20 పెట్రోల్ పై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు విడుదలైన సర్వే ఫలితాలు చూస్తుంటే అవి నిజమే అనిపిస్తోంది.

సర్వేలో ఏమి తేలింది?
లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 305 జిల్లాలకు చెందిన 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాల యజమానులు 44 వేల మందికిపైగా పాల్గొన్నారు. వారిలో 66 శాతం మంది తమ వాహనాల మైలేజ్ 10 శాతానికి పైగా తగ్గిపోయిందని చెప్పారు. మే నెలలో ఈ సంఖ్య 45 శాతంగా ఉండగా.. కేవలం నెల రోజుల్లోనే సమస్యలు 66 శాతం మందిని ఇబ్బంది పెట్టడం గమనార్హం. అలాగే 55 శాతం మంది వాహనాల్లో సాధారణం కంటే ఎక్కువ వేర్ అండ్ టియర్, రిపేర్ ఖర్చులు పెరిగాయని వెల్లడైంది. మేలో ఇది 29 శాతం మంది నుంచి పెరగటం ఆందోళన కలిగిస్తోంది.

మైలేజ్ ఎందుకు తగ్గుతోంది?
E20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి ఉంటుంది. ఇథనాల్‌లో ఎనర్జీ సాంప్రదాయ పెట్రోల్‌తో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఈ తగ్గుదల సాధారణంగా 2 నుంచి 6 శాతం మాత్రమే ఉంటుందని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) పరీక్షలు చెబుతున్నాయి. కానీ వాస్తవ వినియోగంలో 8 నుంచి 12 శాతం వరకు తగ్గుతోందని వాహన యజమానులు గగ్గోలు పెడుతున్నారు.

ప్రభుత్వం, కంపెనీలు ఏమంటున్నాయి?
వాహన ఇంజిన్లకు E20 పెట్రోల్ వల్ల ఎలాంటి పెద్ద నష్టం జరగదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చెబుతోంది. సోషల్ మీడియాలోని ఆరోపణలు కేవలం పుకార్లేనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంటున్నారు. మరోవైపు మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టయోటా కిర్లోస్కర్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా పాత వాహనాలపై పరీక్షలు నిర్వహించినప్పటికీ ఆందోళన చెందాల్సిన అంశాలు ఏవీ కనిపించలేదని చెప్పుకొచ్చాయి.

ALSO READ : Tata EV Discounts: ఈవీ కార్లు కొంటే రూ. 3.35 లక్షల డిస్కౌంట్ ..

వాహనదారుల్లో పెరుగుతున్న ఆందోళన..
ఇప్పటికే E20 పెట్రోలుతో నానా కష్టాలు పడుతుంటే భవిష్యత్తులో E30 ఇంధనం తీసుకురానున్నారనే వార్తలతో కూడా వినియోగదారును ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరో సర్వే ప్రకారం.. 43 శాతం మంది కొత్త వాహనం కొనుగోలును వాయిదా వేసే అవకాశం ఉందని వెల్లడైంది. ఒకవైపు ప్రభుత్వం, ఆటో కంపెనీలు శాస్త్రీయ పరీక్షల ఆధారంగా E20 సురక్షితమే అంటుండగా.. వినియోగదారుల అనుభవాలు మాత్రం భిన్నంగా ఉండటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీంతో E20 పెట్రోల్‌పై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు, పారదర్శక సమాచారం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నడిరోడ్డుపై బైక్స్ ఆగిపోయి నెట్టుకెళ్లి వేలు పోసి రిపేర్లు చేయించాల్సి వస్తోందని E20 పెట్రోల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో సాధారణంగా మారాయి ప్రస్తుతం.