ఉద్యోగం రావట్లేదా? రెజ్యూమ్‌లో ఆ ఒక్క తప్పే కారణం కావొచ్చన్న గూగుల్ రిక్రూటర్

ఉద్యోగం రావట్లేదా? రెజ్యూమ్‌లో ఆ ఒక్క తప్పే కారణం కావొచ్చన్న గూగుల్ రిక్రూటర్

ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్ రావడం లేదా? అర్హతలు ఉన్నా కంపెనీలు స్పందించడం లేదా? అయితే సమస్య మీ అనుభవంలో కాకుండా.. మీ రెజ్యూమ్‌లోనే తప్పు ఉండొచ్చని మాజీ గూగుల్ రిక్రూటర్ సంచలన విషయం వెల్లడించారు. చాలా మంది గుర్తించలేని ఒక చిన్న పొరపాటు ఉద్యోగ అవకాశాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తోందని ఆమె చెప్పారు.

గూగుల్, టిక్‌టాక్, ఉబెర్, ది న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ సంస్థల్లో రిక్రూటర్‌గా పనిచేసిన ఫరా షార్గీ.. అభ్యర్థులు చేసే అతిపెద్ద తప్పును బయటపెట్టారు. చాలా మంది రెజ్యూమ్‌ను తమ గురించి ఇప్పటికే తెలిసిన వ్యక్తి చదువుతున్నట్టుగా రాస్తుంటారన్నారు. కానీ వాస్తవానికి రిక్రూటర్లు మీ గురించి ఏమీ తెలియని వ్యక్తులని, వారు ఒక రెజ్యూమ్‌ను కేవలం కొన్ని సెకన్లపాటు మాత్రమే పరిశీలిస్తారని ఫరా పేర్కొన్నారు. అందుకే రెజ్యూమ్‌లో ప్రతి సమాచారం స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలని ఆమె సూచిస్తున్నారు.

ఉదాహరణకు.. ఒక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశాను అని మాత్రమే రాయడం సరిపోదు. ఆ సంస్థ ఏం చేస్తుంది? అందులో మీ పాత్ర ఏమిటి? ఆ ప్రాజెక్ట్ వల్ల సంస్థకు ఏ ప్రయోజనం కలిగింది? వంటి వివరాలు కూడా సంక్షిప్తంగా పేర్కొనాలని ఆమె చెప్పారు. ఇలా చేస్తే మీ పని విలువ రిక్రూటర్‌కు వెంటనే అర్థమౌతుందన్నారు.

ALSO READ : ఇండియన్ హోటల్స్  సీఈఓ వేతనం రూ.25 కోట్లు..2025–26లో 9 శాతం పెరుగుదల

అలాగే కేవలం నంబర్స్ రాయడం కూడా సరిపోదని ఫరా చెబుతున్నారు. ఉదాహరణకు Q2లో 6.3 లక్షలు సాధించాను అని రాస్తే అది అమ్మకాలా, ఖర్చు తగ్గింపా, ఆదాయమా అనే విషయం రిక్రూటర్లకు ఎలా తెలుస్తుందని అన్నారు. ఆ సంఖ్య ఏ విషయాన్ని సూచిస్తుందో స్పష్టంగా వివరించాలని ఆమె సలహా ఇచ్చారు.

ఇక కంపెనీలో మాత్రమే ఉపయోగించే పదాలు, కోడ్ నేమ్స్ లేదా అందరికీ అర్థం కాని టెక్నికల్ పదజాలాన్ని కూడా రెజ్యూమ్‌లో ఉపయోగించకూడదని సూచించారు. అలాగే "హార్డ్ వర్కింగ్", "ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్" వంటి ప్రశంసల కంటే.. వాటిని నిరూపించే విజయాలను చూపించడం ఉద్యోగం వచ్చే అవకాశాలను మెరుగుపరుస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి మీ రెజ్యూమ్‌ను చదివే వ్యక్తికి మీ గురించి ఏమీ తెలియదనే కోణంలో స్పష్టంగా, సరళంగా రాస్తే ఇంటర్వ్యూ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని తన రిక్రూట్మెంట్ అనుభవాలను పంచుకున్నారు ఫరా.