రెండేళ్లలో ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులను పూర్తి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

రెండేళ్లలో ఎస్ఎల్‌బీసీ  సొరంగం పనులను పూర్తి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు రూ.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోడ్ల విస్తరణతో ఆయా గ్రామాల మధ్య కనెక్టివిటీ పెరగడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందించడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు.ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అన్నారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుల కష్టాలు తెలుసన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.రెండేళ్లలో ఎస్ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగం పనులను పూర్తి చేసి జిల్లాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మంత్రి వెల్లడించారు. రోడ్ల అభివృద్ధి, తాగునీటి వసతుల మెరుగుదలతో నల్గొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.