ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు అధికారాలు కల్పించాలి : కవిత

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు అధికారాలు కల్పించాలి : కవిత

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు అమలు చేయగల అధికారాలు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నారు  తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత  .తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు వర్గాల సమస్యలు భిన్నంగా ఉంటాయని, ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు ద్వారా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిషన్లు కేవలం సలహాలు, సిఫార్సులకే పరిమితమవుతున్నాయని కవిత అన్నారు. కమిషన్లు చేసే సిఫార్సులను తప్పనిసరిగా అమలు చేసే నిబంధనలు లేవని పేర్కొన్నారు. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్నికల కమిషన్‌ తరహాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కూడా అధికారాలు కల్పించాలని కోరారు.

కమిషన్లకు ఎవరు చైర్మన్లుగా ఉన్నారన్నది ముఖ్యం కాదని, బాధితులకు న్యాయం చేసేలా వాటికి తగిన అధికారాలు ఉండటమే కీలకమని కవిత స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సమాజ అభ్యున్నతికి సమయం కేటాయించాలని, తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.