ఏ బాండ్‎పై సంతకం చేయలే.. మళ్లీ వీధుల్లోకి వస్తం.. ఆందోళనలు చేస్తం: అభిజీత్ దీప్కే

ఏ బాండ్‎పై సంతకం చేయలే.. మళ్లీ వీధుల్లోకి వస్తం.. ఆందోళనలు చేస్తం: అభిజీత్ దీప్కే

న్యూఢిల్లీ: భవిష్యత్‎లో నిరసనలు చేయబోమని కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి హామీ పత్రంపై సంతకం చేయలేదని ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. మేం మళ్లీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తామని తేల్చిచెప్పారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో జరిగే అక్రమాలు, అవకతవకలపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. 

భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సీజేపీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న సీజేపీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను పోలీసులు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. 

అనంతరం ఈ ముగ్గురిని పోలీసులు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎస్ఈఎం కోర్టు ముందు హాజరుపరిచారు. రాబోయే ఒక సంవత్సరం పాటు దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలలో పాల్గొనకూడదనే షరతుపై మాత్రమే ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ వీరిని విడుదల చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంవత్సరం పాటు ఎలాంటి నిరసనలు చేయబోమని సీజేపీ ప్రతినిధులు బాండ్‎పై సంతకం చేశారని పోలీసులు వెల్లడించారు. 

►ALSO READ | ఆఫ్రికాలో పడవ బోల్తా..109 మంది జలసమాధి, 116 మంది గల్లంతు

ఈ నేపథ్యంలో సంవత్సరం పాటు నిరసనలు చేయబోమని హామీ పత్రం సంకతం చేశామన్న అంశంపై అభిజిత్ దీప్కే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించాడు. నిరసనలు చేయదని తెలిపే ఎలాంటి బాండ్‌పైనా సీజేపీ సంతకం చేయలేదని పేర్కొన్నారు. మేము మళ్లీ వీధుల్లోకి వస్తాం.. తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. అక్రమ నిర్భంధాలకు బయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.