అలంపూర్, వెలుగు : లారీ ఢీకొనడంతో ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో 44 నంబర్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 22 మంది ప్రయాణికులతో ఏపీలోని హిందూపూర్ నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు మానవపాడు స్టేజీ దగ్గరికి రాగానే.. ఏపీలోని అనంతపూర్ నుంచి జమ్ముకశ్మీర్ వెళ్తున్న ఓ లారీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ఉన్న చిన్న బసవ, వినీత, నవీన్ కుమార్ రెడ్డి, జ్యోతి, ఘాజి తీవ్రంగా గాయపడగా.. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని 108లో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు.
