లండన్: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడోసీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 6–3, 3–6, 6–3తో రోమన్ సఫియుల్లిన్ (రష్యా)పై గెలిచాడు. దాంతో వింబుల్డన్‌లో అత్యధిక విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా జొకో (106) రికార్డులకెక్కాడు.
రోజర్ ఫెడరర్ (105) రెండో ప్లేస్‌కు పడిపోయాడు. 3 గంటలా 26 నిమిషాల మ్యాచ్‌లో తొలి సెట్‌లో సఫియుల్లిన్ నుంచి జొకోకు గట్టి పోటీ ఎదురైంది. అయితే బలమైన సర్వీస్‌లతో టైబ్రేక్‌లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ ఈజీగా గెలిచినా.. మళ్లీ మూడో సెట్‌లో పోటీ ఎదురైంది. అయినప్పటికీ పట్టువదలకుండా పోరాడి సఫియుల్లిన్‌కు చెక్ పెట్టాడు. మ్యాచ్ మొత్తంలో 10 ఏస్‌లు కొట్టిన జొకో 3 డబుల్ ఫాల్ట్స్ చేశాడు.
తన సర్వీస్‌లో 71 శాతం పాయింట్లు రాబట్టాడు. 9 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకున్నాడు. 43 విన్నర్లు, 37 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 45 విన్నర్లు, 35 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసిన సఫియుల్లిన్ నాలుగు బ్రేక్ పాయింట్లనే కాపాడుకున్నాడు. 8 ఏస్‌లు కొట్టి 3 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పెగులా (అమెరికా) 4–6, 6–3, 6–1తో జోవిచ్ (అమెరికా)పై, ముచోవా (చెక్) 7–5, 5–7, 6–3తో క్రెజికోవా (చెక్)పై గెలిచారు.
