హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్పేరుపై ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరు ఇవ్వలేమని, మరో పేరును 15 రోజుల్లో సూచించాలని కవితకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై కవిత కూడా అదే స్థాయిలో స్పందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. న్యాయపరంగా తేల్చుకునేందుకు ఆమె సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగానే పార్టీ పేరుపై హైకోర్టును కవిత ఆశ్రయించినట్టు తెలిసింది. ఆ కేసు విచారణ ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఏకపక్షంగా పేరుపై నిర్ణయం తీసుకున్నదని కవిత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈసీకి వచ్చిన అన్ని అభ్యంతరాలకు సమాధానం చెప్పామని.. కానీ, మరిన్ని అభ్యంతరాలు అని ఈసీ చెబుతున్నా అవేంటో చెప్పడం లేదని ఆమె అన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చిన అభ్యంతరాలేంటో పంపిస్తే.. వాటన్నింటికీ వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కవిత చెబుతున్నట్టు తెలిసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ పేరును వదులుకునేందుకు ఆమె సిద్ధంగా లేరని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ పేరుపై ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పెద్దలే కుట్రలు చేస్తూ పావులు కదుపుతున్నారని టీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పేరును తమకు రానివ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచే వందల కొద్దీ అభ్యంతరాలను పంపించారని, వారి అనుయాయులతో కూడా అభ్యంతరాలు పంపించారని ఆరోపిస్తున్నారు. కాగా, గత నెలలో ఈసీకి దాదాపు టీఆర్ఎస్ పేరుపై 700 దాకా అభ్యంతరాలు వెళ్లాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆ పేరును కేటాయించొద్దని పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ పేరు తెలంగాణ ఉద్యమం, తమ పార్టీకి భావోద్వేగపరంగా చాలా కీలకమని, ఆ పేరును కేటాయిస్తే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందని అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కవితకు టీఆర్ఎస్ పేరును కేటాయించలేమని ఈసీ లేఖ పంపినట్టు చెబుతున్నారు.
