బీఆర్‌‌‌‌ఎస్ ది కమీషన్ల  కాళేశ్వరం మాది ఇందిరమ్మ ఇండ్ల సర్కారు : మంత్రి పొంగులేటి

బీఆర్‌‌‌‌ఎస్ ది కమీషన్ల  కాళేశ్వరం మాది ఇందిరమ్మ ఇండ్ల సర్కారు : మంత్రి పొంగులేటి
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయాల్సిన గత్యంతరం ఎందుకొచ్చింది: మంత్రి పొంగులేటి
  • నాణ్యతలేని నిర్మాణంతో ప్రజలపై బీఆర్ఎస్​ పాలకులు భారం మోపారని మండిపాటు

హైదరాబాద్/ఖమ్మం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి విమర్శించారు. కన్నెపల్లి పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమేనని అన్నారు.  ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి పర్యటించారు. రూ.2 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పేదలకు ఇండ్లు కడితే కమీషన్లు రావు.. కాళేశ్వరంలాంటి భారీ ప్రాజెక్టులు కడితేనే కమీషన్లు వస్తాయనే ఆలోచనతో బీఆర్ఎస్ పాలకులు పేదల గృహాల అవసరాన్ని విస్మరించారు. అందుకే నేడు తెలంగాణ ప్రజలు వారిని అధికారానికి దూరం చేశారు’’ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, కమీషన్ల కోసమే నిర్మించడం వల్లే నేడు మరమ్మతుల అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. ‘‘అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేరు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అవినీతి, మీ కక్కుర్తే దానికి కారణం కాదా? మీరు నాసిరకం నిర్మాణాలు చేసి కూల్చేసి.. ఇప్పుడు వాటిని ప్రభుత్వం బాగు చేయలేదని విమర్శించడం హాస్యాస్పదం” అని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలపై మండిపడ్డారు. 

బీఆర్ఎస్‌‌ నాయకులవి నాటకాలే..

కన్నెపల్లిలోకి వెళ్లి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారి ప్రయత్నాలు ఫలించవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, ఉపాధి కల్పనలాంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నదని, కమీషన్ల కోసం కాదు.. ప్రజల కోసం పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, విద్యా రంగంలో ఉపాధ్యాయ నియామకాలు, వసతిగృహాల్లో సౌకర్యాల మెరుగుదలలాంటి పథకాలను వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, రోడ్ల అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.