కాంగ్రెస్ ఎమ్మెల్సీకి రూ.20 కోట్ల ఆఫర్.. ఓ పార్టీ ప్రలోభ పెడుతోంది: సంజయ్ రౌత్

కాంగ్రెస్ ఎమ్మెల్సీకి రూ.20 కోట్ల ఆఫర్.. ఓ పార్టీ ప్రలోభ పెడుతోంది: సంజయ్ రౌత్

ముంబై: పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ధీరజ్ లింగాడేకు ఓ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం ఉందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు.

ఈ ఆఫర్​ఎవరు ఇచ్చారు, ఏ పార్టీలో చేరాలని కోరారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. దీనిపై స్పందించిన ధీరజ్ లింగాడే ఆదివారం మీడియాతో మాట్లాడారు. తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని, రౌత్ చేసిన ఆరోపణలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, వాటిలో నిజం లేదని చెప్పారు.

మరోవైపు, మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ కూడా రౌత్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. రౌత్ ఎప్పుడూ ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని విమర్శించారు. ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం కంటే తమ పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.