బోనాల కోసం చేతివృత్తుల మేళా..ఉత్పత్తులు కొని కళాకారులను ఆదుకోండి: మంత్రి పొన్నం 

బోనాల కోసం చేతివృత్తుల మేళా..ఉత్పత్తులు కొని కళాకారులను ఆదుకోండి: మంత్రి పొన్నం 

హైదరాబాద్, వెలుగు: బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌‌లోని ఐమాక్స్ పక్కనున్న హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ వృత్తిదారులకు ఈ మేళా గొప్ప వేదిక కానుందని,  బోనాలకు అవసరమైన మట్టి బోనం కుండలు, దీపాలు, వెదురు బుట్టలు, గంపలు, పిత్తళి, రాగి పాత్రలు, పూజా సామగ్రి ఒకే చోట లభించనున్నాయని అన్నారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, పద్మశాలి, నేత, బంగారు పనివారు, రాతి శిల్పులు, తోలు కళాకారులు సహా పలువురు చేతివృత్తి దారులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

బోనాల పండుగతో వ్యాపారులు, వస్త్ర కళాకారులు వేలాది మంది చేతివృత్తిదారులకు ఉపాధి లభిస్తుందన్నారు. “ప్రజా ప్రభుత్వం చేతివృత్తుల పరిరక్షణకు, కళాకారుల జీవనోపాధి బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, సంప్రదాయ వృత్తుల వైపు ప్రోత్సహించడం ఈ మేళా ప్రధాన లక్ష్యం” అని పొన్నం అన్నారు. బోనాల సందర్భంగా నగరానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ మేళాను సందర్శించి చేతివృత్తుల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు.