న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ ఉద్యమాన్ని నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆదివారం లక్నో లో సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు ‘జైల్ భరో’ ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులను తరిమికొట్టేందుకు గాంధీ పిలుపునిచ్చిన ‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో... మోదీ సర్కార్ ను గద్దె దించేలా జైల్ భరో కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
దేశ సంపద ఏనాటికి కార్పొరేట్లది కాదని... ప్రజల సంక్షేమానిదే అని బీజేపి నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ... కార్మిక చట్టాలను నాశనం చేస్తూ, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్న విధానాలను దేశ ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలాగే ఈ సదస్సులో మూడు శ్రమజీవి వర్గాల ఉమ్మడి డిమాండ్లను నాయకులు ప్రవేశపెట్టగా, సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కార్మిక సంఘాలు ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు.
