- ముగ్గురిని అరెస్ట్ చేసిన చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: ట్రాఫిక్ చలానాలు, ఫైనాన్స్ కంపెనీల నుంచి తప్పించుకునేందుకు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌ను మూడు వేర్వేరు బైక్‌లకు ఉపయోగిస్తున్న ముగ్గురు నిందితులను చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న మూడు హోండా యాక్టివా వాహనాలను పోలీసులు గుర్తించారు.
పార్శీగుట్ట కమలా నెహ్రూనగర్‌కు చెందిన లైటింగ్ వ్యాపారి నాకోటి మల్లికార్జున్(28), వ్యాపారి భీమ్ అజయ్‌రెడ్డి(29), సంజీవాపురానికి చెందిన కలెక్షన్ ఏజెంట్ కొప్పుల ధనరాజ్(30) స్నేహితులు. మల్లికార్జున్‌కు సాయిరామ్ అనే వ్యక్తి ఫైనాన్స్‌పై తీసుకున్న హోండా యాక్టివా ఇచ్చాడు. ఆ వాహనానికి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదు. దానిపై రూ.36 వేల బ్యాంకు రుణం ఉండటంతో వాహనాన్ని జప్తు చేస్తారనే భయంతో తన వాహనానికి చెందిన టీఎస్ 09 ఎఫ్‌ఈ 4997 రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ను అమర్చి అజయ్‌రెడ్డికి ఇచ్చాడు.
ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి అదే నంబర్ ప్లేట్‌ను తన మరో స్నేహితుడు ధనరాజ్ వాహనానికీ ఉపయోగించాలని సూచించాడు. దీంతో ముగ్గురూ ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ను మూడు వేర్వేరు హోండా యాక్టివా వాహనాలకు అమర్చి వినియోగిస్తున్నారు. వారాసిగూడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అజయ్‌రెడ్డి పట్టుబడగా, విచారణలో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
