దేశవ్యాప్తంగా 55కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 950కి పైగా కోర్సులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లోనూ మూతపడ్డవి ఇవే!

దేశవ్యాప్తంగా 55కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 950కి పైగా కోర్సులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లోనూ మూతపడ్డవి ఇవే!

స్టూడెంట్స్ చేరకపోవడం, ఫ్యాకల్టీ కొరత వంటి కారణాల వల్ల దేశవ్యాప్తంగా సుమారు 55 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) లెక్కల ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ కాలేజీలు బంద్ అయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ వారి కోర్సు పూర్తి చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ, ఈ ఏడాది నుంచి కొత్తగా మొదటి సంవత్సరం  అడ్మిషన్లు మాత్రం తీసుకోరు.

"2025-26 విద్యా సంవత్సరానికి మొత్తం 58 ఇంజనీరింగ్, టెక్నికల్ కాలేజీలను దశలవారీగా మూసివేస్తున్నాం. ఈ ఏడాది నుంచి ఆ కాలేజీల్లో కొత్తగా ఫస్టియర్ స్టూడెంట్స్‌ను చేర్చుకోరు. కానీ, అప్పటికే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ చదువుతున్న పాత స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ  చదువును అక్కడే పూర్తి చేసుకోవచ్చు" అని AICTE సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కాలేజీలు మూతపడటానికి కారణాలు:
*కాలేజీల్లో చేరే స్టూడెంట్స్ సంఖ్య బాగా తగ్గిపోవడం/ తక్కువ అడ్మిషన్ల కారణం.
*సరిపడా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని మెయింటైన్ చేయలేకపోవడం.
*సరైన మౌలిక సదుపాయాలు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), మేనేజ్‌మెంట్ నిబంధనలు పాటించకపోవడం.

అయితే ఇవి పూర్తిగా ఒకేసారి బంద్ కావడం లేదు, 'క్రమ పద్ధతిలో' మూసివేస్తున్నారు. ఒకవేళ 'పూర్తిగా' మూసివేస్తే..  ఇప్పటికే అందులో  చదువుతున్న స్టూడెంట్స్‌ను వేరే కాలేజీలకు మార్చాల్సి వచ్చేది. కానీ ఇక్కడ పాత స్టూడెంట్స్ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొత్త అడ్మిషన్లు ఆపేసి కాలేజీలను క్లోజ్ చేస్తున్నారు.

►ALSO READ | భారీ వర్షాలకు పుణె ఆగమాగం.. ముంబై-పుణె మధ్య తెగిపోయిన సంబంధాలు.. అన్నీ బంద్

ఏ రాష్ట్రాల్లో ఎన్ని కాలేజీలు మూతపడ్డాయి అంటే ?
ఈ విద్యా సంవత్సరంలో మూతపడిన 58 కాలేజీల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు టాప్‌లో ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్: 12 కాలేజీలు

మహారాష్ట్ర: 12 కాలేజీలు

మధ్యప్రదేశ్: 8 కాలేజీలు

తెలంగాణ: 4 కాలేజీలు

పంజాబ్: 4 కాలేజీలు

ఆంధ్రప్రదేశ్: 3 కాలేజీలు

రాజస్థాన్: 3 కాలేజీలు

గుజరాత్, కర్ణాటక, పూణే, తమిళనాడు: చెరో 2 కాలేజీలు

హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్: చెరో 1 కాలేజీ

ఈ 58 కాలేజీల్లో కేవలం 3 మాత్రమే గవర్నమెంట్ ఎయిడెడ్ (ప్రభుత్వ సాయం పొందేవి) కాలేజీలు కాగా, మిగిలినవన్నీ ప్రైవేట్ కాలేజీలే.

950కి పైగా కోర్సులు బంద్
కేవలం కాలేజీలు మూతపడటమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ లేని దాదాపు 950కి పైగా కోర్సులను (బ్రాంచ్‌లను) కూడా పూర్తిగా తీసేశారని AICTE అధికారి చెప్పారు.

AICTE అంటే ఏంటి?
భారతదేశంలో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ లాంటి సాంకేతిక విద్యను పర్యవేక్షించే అత్యున్నత ప్రభుత్వ నియంత్రణ సంస్థే AICTE. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు, క్వాలిటీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఈ సంస్థే చూసుకుంటుంది.