SIP చేస్తున్నారా? ఏ మ్యూచువల్ ఫండ్ అన్నది కాదు.. డబ్బును ఎలా పంచారన్నదే అసలు సక్సెస్!

SIP చేస్తున్నారా? ఏ మ్యూచువల్ ఫండ్ అన్నది కాదు.. డబ్బును ఎలా పంచారన్నదే అసలు సక్సెస్!

మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది మొదట అడిగే ప్రశ్న... "ఏ ఫండ్ బెస్ట్?" కానీ పెట్టుబడి ప్రపంచంలో అసలు విజయాన్ని నిర్ణయించేది ఫండ్ ఎంపిక కాదని, అసెట్ అలోకేషన్ అని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చెబుతున్నారు. అంటే మీ డబ్బును ఈక్విటీ, డెట్, గోల్డ్ లేదా ఇతర ఆస్తుల్లో ఎంత శాతం కేటాయించారన్నదే దీర్ఘకాలిక సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తుందని వారు చెబుతున్నారు.

చాలా మంది పెట్టుబడిదారులు గతంలో మంచి రాబడులు ఇచ్చిన ఫండ్‌ల వెంట పరుగులు తీస్తుంటారని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ హరీష్ కృష్ణన్ అన్నారు. కానీ మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అందుకే ఒకే ఫండ్ లేదా ఒకే రంగంపై ఆధారపడకుండా.. వివిధ ఆస్తుల్లో పెట్టుబడులను విభజించడం వల్ల రిస్క్ తగ్గి, స్థిరమైన రాబడులు పొందే అవకాశం పెరుగుతుందని అన్నారు.

మార్కెట్‌లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు చాలామంది భయంతో SIPలను నిలిపివేయడం లేదా ఫండ్‌లను మార్చేయడం చేస్తుంటారు. ఇది పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ పడిపోయిన సమయంలో SIP కొనసాగిస్తే తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లు పొందొచ్చు. దీర్ఘకాలంలో ఇదే కాంపౌండింగ్ ద్వారా మంచి సంపదను నిర్మించడంలో సహాయపడుతుందని గుర్తుచేస్తున్నారు.

ఇప్పటి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు వంటి అంశాల నేపథ్యంలో కూడా పెట్టుబడులను ఒకే మార్కెట్‌కు పరిమితం చేయకుండా కొంత భాగాన్ని ఇంటర్నేషనల్ ఈక్విటీల్లో పెట్టడం ద్వారా పోర్ట్‌ఫోలియోను మరింత బలంగా మార్చుకోవచ్చని సూచించారు హరీష్ కృష్ణన్. సాధారణంగా మొత్తం పెట్టుబడిలో 10 నుంచి 20 శాతం వరకు అంతర్జాతీయ పెట్టుబడులు ఉండటం డైవర్సిఫికేషన్‌కు ఉపయోగపడుతుందన్నారు.

ALSO READ : ఉద్యోగం రావట్లేదా? రెజ్యూమ్‌లో ఆ ఒక్క తప్పే కారణం కావొచ్చన్న గూగుల్ రిక్రూటర్

కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే వారు నెలకు రూ.10వేలతో కూడా SIP ప్రారంభించవచ్చని, మొత్తం ఎంతతో మొదలుపెట్టామన్నది కాదు.. ఎంత క్రమశిక్షణగా కొనసాగించామన్నదే ముఖ్యమని హరీష్ కృష్ణన్ చెబుతున్నారు. ఆదాయం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని కూడా పెంచితే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ అద్భుత ఫలితాలు ఇస్తుందని వెల్లడించారు. పెట్టుబడుల్లో విజయం సాధించాలంటే మార్కెట్‌ను టైమ్ చేయడానికి ప్రయత్నించడం కంటే.. సరైన అసెట్ అలోకేషన్‌తో క్రమశిక్షణగా ఇన్వెస్ట్మెంట్ కొనసాగించడమే సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్లు వ్యూహమని అన్నారు.