ఆదాయానికి మించిన ఆస్తుల కేసు..డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు..డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)  భీమ్‌రెడ్డిని జులై 6న  ఏసీబీ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.   ఇటీవల
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటకలోని ఏకంగా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో.. ఏసీబీ చరిత్రలోనే కళ్లు చెదిరే స్థాయి అక్రమాస్తులను ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే.

నార్సింగిలోని వెసెల్లా మెడోస్ విల్లా, గచ్చిబౌలి, టెలికాం నగర్, తెల్లాపూర్‌లలో లగ్జరీ ఫ్లాట్లు, మణికొండలో కమర్షియల్ కాంప్లెక్స్ షేర్లు, వికారాబాద్, పటాన్‌చెరులలో ఓపెన్ ప్లాట్లు.. కర్ణాటక, బెంగళూరు పరిసరాల్లో సుమారు 46 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ 200 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా.

భీమ్‌రెడ్డి నివాసంలో రూ.3.6 లక్షల నగదు, ఆయన బినామీ ఇంట ఏకంగా రూ.40 లక్షల నగదు లభించింది. వీటితో పాటు 2 కేజీల బంగారు ఆభరణాలు, 20 కేజీల వెండి వస్తువులు, రూ.20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాదు, సోదాల సమయంలో డీఎస్పీ ఇంట్లో 23 విదేశీ మద్యం బాటిళ్లు కూడా దొరకడంతో ఎక్సైజ్ శాఖ విడిగా కేసు నమోదు చేసింది.

హై డ్రామా.. నోటీసులపై విమర్శలు.. ఆపై అరెస్ట్

దాడుల సమయంలో భీమ్‌రెడ్డి భార్య రాసిన ఒక రహస్య డైరీ ఏసీబీకి దొరికింది. దాని ఆధారంగానే ఈ బినామీ ఆస్తుల లింకులన్నీ బయటపడ్డాయి. అయితే, సోదాల సమయంలో భీమ్‌రెడ్డి బీపీ ఒక్కసారిగా  పెరగడంతో ఆయనకు అనారోగ్య కారణాల రీత్యా కేవలం 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి అధికారులు వెనుదిరిగారు.

ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల అక్రమాస్తులు దొరికినప్పటికీ.. కేవలం నోటీసులతో సరిపెట్టడంతో ఏసీబీ తీరుపై సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో, తీవ్ర ఒత్తిడి నడుమ ఏసీబీ అధికారులు డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఇవాళ అధికారికంగా అరెస్ట్ చేశారు.