ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుగాలి ప్రీతి కేసు మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి స్వయంగా ఈ ఫిర్యాదును అందజేశారు. అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసులో న్యాయం చేస్తానని నమ్మించి, పవన్ కళ్యాణ్ తమ్ముడిలా అండగా ఉంటానన్న మాట తప్పి మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసిపోతున్నా, నా కూతురి కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం అత్యంత బాధాకరం" అని పార్వతి దేవి కన్నీరుమున్నీరయ్యారు.ఒక యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేయడానికి మాత్రం ఐదు రోజులుగా దాదాపు 500 మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలు ఉరుకులు పరుగులు పెట్టారు. కానీ, ఓ ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయడంలో ఎందుకీ వివక్ష? అని ఆమె ప్రశ్నించారు.
నా బిడ్డ ప్రాణాలు తీసిన నిందితులు ఈ రోజు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా మా కళ్ల ముందే తిరుగుతున్నారు. ఆ యూట్యూబర్‌పై పెట్టిన శ్రద్ధలో కనీసం 10 శాతం మా కేసుపై పెట్టి ఉంటే, ఈపాటికే మా కుటుంబానికి న్యాయం జరిగేది అంటూ నిప్పులు చెరిగారు.
మొదటి సంతకం అంటూ హామీ ఇచ్చి మోసం చేయడం, ఆదివాసీ బిడ్డ మరణంపై బహిరంగ విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం,నిందితులకు పరోక్షంగా అండగా నిలుస్తూ కేసును పక్కదారి పట్టించడం వంటి సెక్షన్ల కిందకింద పవన్ పై చర్యలు తీసుకోవాలని పార్వతి దేవి డిమాండ్ చేశారు.
