జింబాబ్వే టీ20 సిరీస్‎కు భారత జట్టు ప్రకటన.. శాంసన్‎కు షాకిచ్చిన బీసీసీఐ

జింబాబ్వే టీ20 సిరీస్‎కు భారత జట్టు ప్రకటన.. శాంసన్‎కు షాకిచ్చిన బీసీసీఐ

న్యూఢిల్లీ: జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సోమవారం (జులై 6) అనౌన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్‎ను కెప్టెన్‎గా ఎంపిక చేయగా.. యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్‎గా నియమించింది. ఐర్లాండ్ వంటి పసికూనపై టీమిండియా టీ20 సిరీస్ కోల్పోయినప్పటికీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‎పై బీసీసీఐ నమ్మకం ఉంచింది. 

శాంసన్ ఔట్.. రింకు ఇన్

జింబ్వాబేతో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‎కు బీసీసీఐ షాకిచ్చింది. ఈ సిరీస్‎కు అతడిని ఎంపిక చేయలేదు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‎ల్లో పేలవ ప్రదర్శన కారణంగానే అతడిపై వేటు వేసినట్లు సమాచారం. 

ఇక, ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న టీ20 సిరీస్‎లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్‎లోకి అడుగుపెట్టిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే సిరీస్‎కు కూడా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‎కు శాంసన్ ఎంపిక కాకపోవడంతో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేందుకు వైభవ్‎కు లైన్ క్లియర్ అయ్యింది. మరో స్టార్ ఆల్ రౌండర్ రింకు సింగ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. 

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్ ముగిసిన తర్వాత జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ టూర్‎లో భాగంగా జింబాబ్వేతో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. హరారే వేదికగా జూలై 23, 25, 26వ తేదీలలో ఈ మ్యాచులు జరగనున్నాయి.

జింబాబ్వే టూర్‎కు భారత టీ20 జట్టు ఇదే

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాంశ్ షేడ్గే, రింకు సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‎సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).