మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి, కంటెంట్ క్రియేషన్ కెరీర్‌గా మార్చుకున్న ఒక మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి, ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు వెల్లడించాడు. క్రిస్టియన్ హార్మ్స్ అనే ఈ యువకుడు స్విట్జర్లాండ్‌లో ఏడాదికి $200,000 అంటే సుమారు రూ.1.6 కోట్లకు పైగా జీతం వచ్చే మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసి, ఆస్ట్రేలియాకు మారినట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
సొంతంగా కంటెంట్ చేస్తూ, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అతను అనుకున్నాడు. కానీ, అంతా రివర్స్ అయ్యి బెడిసి కొట్టింది.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగానికి గుడ్ బై
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలేయడం కరెక్ట్ నిర్ణయమే అని మనసుకు అనిపించినా, కొన్ని రోజుల తరువాత మాత్రం 'తప్పు నిర్ణయం తీసుకున్నానా ?' అని నాకు నేను చాలాసార్లు ప్రశ్నించుకుంటున్నట్లు హార్మ్స్ చెప్పాడు.
"మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలేయడం నేను నా జీవితంలో చేసిన అత్యంత తెలివితక్కువ పని కావచ్చు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే మంచి జీతం, లైఫ్ సెటిల్‌మెంట్, సమాజంలో వచ్చే గుర్తింపు... వీటన్నింటినీ వదిలేసి బయటకు రావడం అంత ఈజీ కాదు. నేను మంచి నిర్ణయమే తీసుకున్నానని నాకు తెలుసు, కానీ కొన్ని రోజులు మాత్రం భయం, సందేహలు నన్ను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి." అని My Museum of Failures అనే టైటిల్‌తో పెట్టిన వీడియోలో 27 ఏళ్ల హార్మ్స్ చెప్పుకొచ్చాడు.
అతను మైక్రోసాఫ్ట్‌లో ఉన్నప్పుడు చాలా మంచి లైఫ్ లీడ్ చేశానని, స్విట్జర్లాండ్‌లో జాబ్ చేయడం వల్ల యూరప్ మొత్తం తిరిగే అవకాశం వచ్చిందని గతంలో చెప్పాడు. కానీ, కేవలం 26 ఏళ్ల వయసులోనే వాటన్నింటినీ వదిలేసి ఆస్ట్రేలియాకు షిఫ్ట్ అయ్యాడు.
ALSO READ : ఉద్యోగం రావట్లేదా? రెజ్యూమ్‌లో ఆ ఒక్క తప్పే కారణం కావొచ్చన్న గూగుల్ రిక్రూటర్
"కేవలం ఇంటర్నెట్‌లో బ్రాండ్ల కోసం వీడియోలు చేయడం కోసం అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేశాను. కానీ ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. ఈపాటికి ఒక పెద్ద బిజినెస్‌మెన్ అవ్వాల్సింది. రిస్క్ తీసుకున్న నాకు నేను న్యాయం చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అయితే, నేను సరైన దారిలోనే ఉన్నానని నా మనసుకు తెలుసు" అని అన్నాడు.
ఎలాంటి ప్లాన్ లేకుండా ఆస్ట్రేలియాకు
అసలు ఎలాంటి ముందస్తు ప్లాన్ లేకుండానే ఆస్ట్రేలియా వెళ్ళిపోయానని, అంతా సెట్ చేసుకోవడానికి తనకి తాను ఐదు నెలల టైమ్ ఇచ్చుకున్నానని హార్మ్స్ చెప్పాడు.
"తిరిగి ఇంటికి వచ్చేయడానికి ఒక వారం ముందు మాత్రమే నేను ఆన్‌లైన్‌లో నా మొదటి డాలర్ సంపాదించాను. నెలల తరబడి ప్లాన్ చేయలేని పనిని, ఆ చివరి నిమిషం గడువు పూర్తి చేయించింది. పరిస్థితి చేతులు దాటిపోతే తప్ప నేను అలర్ట్ అవ్వనని నాకు అర్థమైంది. కానీ ఆ లక్షణం నాకు అస్సలు నచ్చదు" అని వివరించాడు.
చాలా నెలల పాటు ఒక బిజినెస్ పెట్టడానికి ట్రై చేశాడు. కానీ అసలు తనకు ఆ బిజినెస్ అవసరమా లేదా అని కూడా ఆలోచించలేదు.
"అసలు ఈ బిజినెస్ చేయాలా వద్దా అని క్లారిటీ లేకుండానే నెలల తరబడి కష్టపడ్డాను. ఏదో చేస్తున్నానని నన్ను నేను నమ్మించుకున్నాను కానీ, నిజానికి అది భయం వల్ల దిక్కుతోచక చేసిన పని. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలల తరబడి కష్టపడ్డాను, చివరికి సాధించింది ఏమీ లేదు" అని హార్మ్స్ పేర్కొన్నాడు.
చివరికి... కార్పొరేట్ లైఫ్ ఇచ్చే సేఫ్టీని వదులుకుంటే నిజ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో అందరికీ చూపించడానికే, తను పడుతున్న ఇబ్బందులను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోల రూపంలో పెడుతున్నట్లు అతను తెలిపాడు.
