మణిపూర్‎లో భారత ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు సైనికులు వీర మరణం

మణిపూర్‎లో భారత ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు సైనికులు వీర మరణం

ఇంఫాల్: మణిపుర్‌లో మిలిటెంట్లు ఘాతుకానికి ఒడిగట్టారు. సరిహద్దులో భద్రతకు వెళ్తున్న అసోం రైఫిల్స్ సైనికుల కాన్వాయ్‌పై అటాక్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు వీర మరణం పొందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (జులై 6) మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఉఖ్రుల్ జిల్లాలోని నుంగ్‌షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఆకస్మిక దాడి నుంచి వెంటనే తేరుకున్న భద్రతా దళాలు కౌంటర్ ఆపరేషన్ చేపట్టాయి. దాడికి పాల్పడిన వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో అణువణువు జల్లెడ పడుతున్నారు. గాయపడ్డ జవాన్లు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ నీచమైన హింసా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇటువంటి దాడులకు సమాజంలో స్థానం లేదన్నారు. 

మణిపూర్ హోం మంత్రి గోవిందాస్ కొంతౌజం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇద్దరు జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. ఈ దాడి అత్యంత దురదృష్టకరమని.. ఇటువంటి దాడులు రాష్ట్రంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.