ఈ పాపంలో పాలుపంచుకున్న ఏ ఒక్కరిని వదలొద్దు: విరాళాల స్కామ్‎పై అయోధ్య ట్రస్ట్ చీఫ్ ఆగ్రహం

ఈ పాపంలో పాలుపంచుకున్న ఏ ఒక్కరిని వదలొద్దు: విరాళాల స్కామ్‎పై అయోధ్య ట్రస్ట్ చీఫ్ ఆగ్రహం

లక్నో: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న అయోధ్య రామమందిర విరాళాల్లో గోల్ మాల్, నిధుల దుర్వినియోగం వ్యవహారంపై రామ మందిర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ తొలిసారి స్పందించారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య రామ మందిరంలో దొంగతనం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏ ఒక్కరిని వదలొద్దని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం (జులై 6) మహంత్ నృత్య గోపాల్ దాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘‘శ్రీ రామ్ లల్లా ఆలయంలో విరాళాల దొంగతనం నన్ను తీవ్రంగా బాధించింది. ఈ పాపానికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. ఈ పాపపు చర్యలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది కోట్లాది హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం’’ అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత లాభం కోసం ఈ విషయంలో ఎవరూ రాజకీయాలు చేయవద్దని అభ్యర్థించారు. 

రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం

విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం ఆరోపణలు ప్రకంపనలు రేపుతోన్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించేందుకు సోమవారం (జులై 6) రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కీలక భేటీలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆలయ పరిపాలనా, కార్యనిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆలయానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకంపైన ట్రస్ట్ చర్చించినట్లు తెలిసింది. 

అయోధ్య రామ మందిరంలో విరాళాలు స్వాహా

పవిత్ర అయోధ్య రామాలయంలో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. రామయ్యకు భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలను కొందరు స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో పలువురిని విచారించిన సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. ఆలయంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, విశ్వహిందు పరిషత్ అగ్రనేత చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు వినోద్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు.