ఒక యువకుడి అనుమానాస్పద మృతి.. ప్రేమ, కుట్ర ఆరోపణలు.. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలు.. ఇవన్నీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుండగా, ఇప్పుడు మరో కీలక అంశం రాజకీయ వేదికపైకి వచ్చింది. పురుషులు కూడా బాధితులే కావచ్చు.. వారికి కూడా ప్రత్యేక రక్షణ, న్యాయ సహాయం అవసరం అంటూ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
పూణేలో 25 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసు నేపథ్యంలో అశోక్ కుమార్ మిట్టల్ స్పందిస్తూ.. ఈ ఘటన తీవ్ర కలచివేసిందన్నారు. కేతన్‌తో పాటు అతని కుటుంబానికి నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు జరగాలని, న్యాయం తప్పకుండా అందాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తాను ఇప్పటికే పార్లమెంట్‌లో 'నేషనల్ కమిషన్ ఫర్ మెన్' ఏర్పాటు కోసం బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
మిట్టల్ అభిప్రాయం ప్రకారం.. కేతన్ కేసు ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. బాధితులు కేవలం మహిళలే కాదు.. పురుషులు కూడా నేరాలకు బలయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి సందర్భాల్లో వారికి కూడా చట్టపరమైన రక్షణ, సంస్థాగత మద్దతు, తమ సమస్యలు వినిపించే వేదిక ఉండాలని అభిప్రాయపడ్డారు. లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ కేసు దర్యాప్తు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. జూన్ 18న పూణే సమీపంలోని లోహగడ్ కోట వద్ద కొండపై నుంచి కేతన్ అగర్వాల్ కిందపడిపోయి మరణించాడు. తొలుత ప్రమాదంగా భావించిన ఈ ఘటన తర్వాత.. అతని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కుట్రపూర్వకంగా కేతన్‌ను తోసివేసిందనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో కేసు సంచలనంగా మారింది. నవంబర్‌లో ఇద్దరి వివాహం జరగాల్సి ఉండటం మరింత చర్చకు దారితీసింది.
ALSO READ : పెళ్లయిన మూడు నెలలకే 22 ఏళ్ల అమ్మాయిని పొట్టన పెట్టుకున్న భర్త..
ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పాలీగ్రాఫ్ పరీక్షకు నిరాకరించడంతో పాటు, వారి మొబైల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను పోలీసులు రికవరీ చేశారు. కోడ్ పదాలు, నిక్‌నేమ్స్, ఎమోజీల రూపంలో జరిగిన చాట్‌లను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ సంభాషణల్లో మరో వ్యక్తి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. సో ఈ కేసు కేవలం ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కే పరిమితం కాకుండా.. పురుషుల హక్కులు, వారికి ప్రత్యేక కమిషన్ అవసరం గురించి జాతీయ స్థాయిలో చర్చకు నాంది పలికింది.
