టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం 'కింగ్100'. రోజురోజుకూ ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున.. తన సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ను జూలై 10, 2026 తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
లేడీ విలన్‌గా టబు వైల్డ్ ఎంట్రీ!
అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్ నుండి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ ఆల్‌టైమ్ క్లాసిక్ 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడ మా ఆవిడే' చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన నాగార్జున - టబు కాంబినేషన్ సుమారు 28 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. కానీ ఇక్కడే ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. ఈసారి వీరిద్దరూ లవర్స్‌గా కాదు.. ఒకరికొకరు తలపడే 'హీరో vs విలన్'గా కనిపించబోతున్నారట. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు.
తండ్రి-కూతురు సెంటిమెంట్ తో..
దర్శకుడు రా. కార్తీక్ రూపొందిస్తున్న ఈ చిత్రం ర్యాగ్స్-టు-రిచెస్ బ్యాక్‌డ్రాప్‌లో, తండ్రి-కూతురు మధ్య సాగే బలమైన భావోద్వేగ కథతో తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ నటి సుష్మిత్ భట్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నాగార్జున కెరీర్లో 100వ సినిమా కావడంతో కథ, పాత్రలు, సాంకేతిక విలువల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు టబూ గత కొన్నేళ్లుగా సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ ఆమె తనదైన ముద్ర వేయగలరనే నమ్మకం అభిమానుల్లో ఉంది. దీంతో 'కింగ్100'లో నిజంగానే ఆమె ప్రధాన ప్రతినాయకురాలిగా కనిపిస్తే, ఇది తెలుగు సినీ ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించే అవకాశముంది. జూలై 10 తర్వాత రానున్న అధికారిక ప్రకటనతో ఈ వైరల్ ప్రచారాల్లో ఎంత నిజం ఉందో తేలిపోనుంది.
