హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2'ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు (సోమవారం , జులై 6, 2026) నాంపల్లి కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు న్యాయస్థానం పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఆయన ముంబైలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, విచారణకు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిజానికి, ఈరోజు విచారణకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ పోలీసులు ముందే నోటీసులు జారీ చేశారు. అయితే, షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఆయన రాలేకపోతున్నారని.. వర్చువల్ హాజరుకు అనుమతించాలని బన్ని తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. గత విచారణలోనూ బన్నీ వర్చువల్‌గానే హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP)... అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు సహా మొత్తం 23 మంది నిందితులకు సంబంధించిన 500 పేజీల భారీ ఛార్జ్‌షీట్ కాపీలను న్యాయస్థానానికి అందజేశారు. అయితే, ఈ కేసులో ఉన్న నిందితుల్లో కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు కోర్టుకు హాజరుకాలేదు. గతంలోనే కోర్టు స్పష్టం చేస్తూ కేసులోని 23 మంది నిందితులూ కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ ముందుకు సాగుతుందిఅని తేల్చిచెప్పింది. కొందరు నిందితులు గైర్హాజరు కావడంతో, న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల (జులై) 29కి వాయిదా వేసింది.
‘పుష్ప-2’ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు స్టార్ హీరోతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.
