హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వం (సృష్టి) ఎలా ఏర్పడింది. సృష్టి అంటే ఏమిటి.. దానిని ఎవరు ఏర్పరచారు. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
బ్రహ్మ దేవుడు, దక్ష ప్రజాపతి, కశ్యప మహర్షిల ద్వారా సృష్టి ఏర్పడిందని బ్రహ్మ పురాణం ద్వారా తెలుస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం దీనిలో మూడు ప్రధాన ఘట్టాలున్నాయి.
బ్రహ్మ దేవుని ఆవిర్భావం .. మానస పుత్రుల సృష్టి
సృష్టికి పూర్వం ఎటు చూసినా మహా అంధకారం, శూన్యం మాత్రమే ఉండేవి. అప్పుడు శ్రీమహావిష్ణువు నాభి (బొడ్డు) నుండి ఒక దివ్యమైన పద్మం ఉద్భవించింది. ఆ పద్మం నుండి బ్రహ్మ దేవుడు ఆవిర్భవించాడు.విశ్వాన్ని సృష్టించాలనే సంకల్పంతో బ్రహ్మ దేవుడు ఘోరమైన తపస్సు చేశాడు.
ఆ తపఃశక్తితో ఆయన మొదట తన మనస్సు నుండి కొందరు పుత్రులను సృష్టించాడు. వీరినే మానస పుత్రులు అంటారు (మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు మరియు దక్షుడు). అయితే, ఈ మానస పుత్రులలో ఎక్కువ మంది తపస్సు, మోక్ష మార్గాల వైపు వెళ్ళిపోవడంతో సృష్టి ముందుకు సాగలేదని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉందని పండితులు చెబుతున్నారు.
ఆ తరువాత సృష్టిని భౌతికంగా విస్తరించడానికి బ్రహ్మ దేవుడు తన శరీరాన్ని రెండు భాగాలుగా చేసి, ఒక భాగం నుండి స్వయంభువ మనువును.. మరో భాగం నుండి శతరూప అనే స్త్రీని సృష్టించాడు. వీరి ద్వారానే మానవ సృష్టి ప్రారంభమైంది.
దక్ష ప్రజాపతి పాత్ర ...సృష్టి విస్తరణ మొదటి అడుగు..
బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన దక్షుడికి సృష్టిని విస్తరించే బాధ్యత అప్పగించి, ఆయనను ప్రజాపతిని ప్రజలకు పాలకుడు.. ప్రజలకు తండ్రిని చేశారు.
అసృజన ద్వారా సృష్టి: మొదట దక్షుడు తన సంకల్పం ద్వారా వేల మంది పుత్రులను (హర్యశ్వులు, శబలాశ్వులు) సృష్టించాడు. కానీ నారద మహర్షి ఉపదేశంతో వారంతా సన్యాసులుగా మారిపోయారు.
మైథున సృష్టి (వివాహ వ్యవస్థ): దీనితో దక్షుడు భౌతికమైన పునరుత్పత్తి (మైథున సృష్టి) వైపు మొగ్గు చూపాడు. ఆయనకు 60 మంది కుమార్తెలు జన్మించారు.
►ALSO READ | జ్యోతిష్యం : మీనరాశిలోకి చంద్రుడు..ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!
సృష్టి వేగంగా విస్తరించడం కోసం దక్ష ప్రజాపతి తన కుమార్తెలను విశ్వంలోని ప్రముఖులకు ఇచ్చి వివాహం చేశాడు. వారిలో 27 మందిని చంద్రుడికి (వీరే మన 27 నక్షత్రాలు)...13 మందిని ...కశ్యప మహర్షికి...10 మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం జరిపించాడు.
3. కశ్యప మహర్షి - సమస్త జీవరాశుల సృష్టి
ప్రస్తుతం సృష్టిని మనం చూస్తున్న రూపంలోకి తీసుకువచ్చిన ఘనత కశ్యప మహర్షికే దక్కుతుందని పండితులు చెబుతున్నారే . అందుకే ఆయనను సర్వజీవ సృష్టికర్త అంటారు. దక్షుడి 13 మంది కుమార్తెలు కశ్యపుడిని వివాహం చేసుకున్నారు. వారి ద్వారానే ఈ సృష్టిలోని విభిన్న జీవరాశులు జన్మించాయి
కశ్యపుడి భార్యలు (దక్షుడి కుమార్తెలు) .. జన్మించిన జీవరాశులు / సంతతి.
- అదితి: దేవతలు (ఆదిత్యులు - ఇంద్రుడు, సూర్యుడు, వామనుడు వగైరా)
- దితి: దైత్యులు (రాక్షసులు - హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వగైరా)
- కద్రువ: నాగులు (పాములు - శేషుడు, వాసుకి వగైరా)
- వినత: పక్షులు (గరుత్మంతుడు, అనూరుడు)
- దనుకు, కళ, దనయ: దానవులు
- సురభి: గోవులు, గేదెలు (పశువులు)
- సింహిక : సింహాలు, పులులు, క్రూర జంతువులు,
- తిమి: జలచరాలు
- తామ్ర, క్రోధవశ: కోపంతో ఉన్న రాక్షసులు
- మను: మానవులు
బ్రహ్మ దేవుడు విశ్వానికి మూల కారణం కాగా... దక్ష ప్రజాపతి స్త్రీ-పురుష సంయోగం ద్వారా సృష్టి జరిగేలా మార్గాన్ని సుగమం చేశాడు. ఆ మార్గం ద్వారా కశ్యప మహర్షి దేవతలు, రాక్షసులు, మనుషులు, పక్షులు, జంతువులు, పాములు ఇలా సమస్త జీవరాశులను సృష్టించి బ్రహ్మాండాన్ని విస్తరించారు. పురాణాల ప్రకారం .. సృష్టిలోని సమస్త జీవరాశులు అందరకి మూలంగా తండ్రి కశ్యప మహర్షి అని బ్రహ్మ పురాణం ద్వారా తెలుస్తుంది...!
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పురాణాల ప్రకారం పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
