అమెరికాలో ప్రతి ఏటా జరిగే ఒక విచిత్రమైన 'తిండి పోటీ' ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికా స్వాతంత్ర దినోత్సవం (జూలై 4) సందర్భంగా న్యూయార్క్‌లోని కోనీ ఐలాండ్‌లో నిర్వహించిన "నాథన్స్ ఫేమస్ హాట్ డాగ్ ఈటింగ్ కాంటెస్ట్"లో జోయీ చెస్ట్‌నట్, మికి సుడో అనే ఇద్దరు వ్యక్తులు తినడంలో మాకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మగవారి విభాగంలో జోయీ చెస్ట్‌నట్ కేవలం 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్‌లను తినేసి, 18వ సారి ఛాంపియన్‌గా నిలిచాడు. ఇక ఆడవారి విభాగంలో మికి సుడో 38.75 హాట్ డాగ్‌లు తిని, రికార్డు స్థాయిలో 12వ సారి టైటిల్ గెలుచుకుంది.
రూ. 9.5 లక్షల ప్రైజ్ మని..
ఈ అద్భుత విజయంతో జోయీ చెస్ట్‌నట్ ప్రతిష్టాత్మకమైన 'మస్టర్డ్ యెల్లో బెల్ట్' తో పాటు $10,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 9.5 లక్షల ప్రైజ్ మని గెలుచుకున్నాడు. "జూలై 4న ఇక్కడికి వచ్చి ఇలా తినడం ఒక కలలా ఉంటుంది. భూమి మీద ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి లేదు" అని గెలిచిన ఆనందంలో చెస్ట్‌నట్ అన్నాడు. నిజానికి ఇతనికి ఈ పోటీ కొత్తేం కాదు. ఇప్పటివరకు 21 సార్లు ఈ పోటీలో పాల్గొనగా.. ఏకంగా 18 సార్లు ఇతనే గెలిచాడు! ఈసారి రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి 51 హాట్ డాగ్‌లు మాత్రమే తినగలిగాడు. అయితే, 2021లో అతను సొంతంగా నెలకొల్పిన రికార్డు (76 హాట్ డాగ్‌లు)ను మాత్రం జోయీ ఈసారి బ్రేక్ చేయలేకపోయాడు.
ఎండ వేడి వల్లే
అక్కడ 90 డిగ్రీల ఫారెన్‌హీట్ (దాదాపు 32°C) ఎండ వేడి ఉండటం వల్ల త్వరగా అలసిపోయానని, అందుకే అనుకున్నంత వేగంగా తినలేకపోయానని జోయీ చెప్పాడు. "ఎండ వల్ల గొంతు ఎండిపోపోయింది. అందుకే కొంచెం ప్రశాంతంగా తింటూ సాగాను. పోటీ అయిపోయాక కడుపులో ఇంకా ఖాళీ ఉన్నట్లే అనిపిస్తోంది.. వెళ్లి ఏదైనా చల్లగా ఉండేది తినాలి" అంటూ నవ్వుతు జోయీ చెప్పాడు.
►ALSO READ | 'నేను చేసిన అత్యంత తెలివితక్కువ పని ఇదే..': కంటెంట్ క్రియేషన్ కోసం కోటిన్నర జీతం ఉద్యోగం వదిలేశాడు..
మొగుడు, పెళ్లాలూ ఇద్దరూ రికార్డు
ఇక మహిళల విభాగంలో గెలిచిన మికి సుడోకు కూడా ఒక క్రేజీ రికార్డ్ ఉంది. ఆమె 2021లో 51 హాట్ డాగ్‌లు తిని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. విశేషం ఏంటంటే.. ఆమె భర్త కూడా పెద్ద తిండిపోతే! ఆయన 2021లోనే కేవలం 3 నిమిషాల్లో 50 ఉడికించిన గుడ్లు తిని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు కొట్టిన వెంటనే అక్కడే ఆమెకు లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. ఈసారి గెలిచిన తర్వాత మికి సుడో మాట్లాడుతూ.. "ఇదంతా నా కండరాల ప్రాక్టీస్ వల్ల, ఇక్కడికి వచ్చిన జనాలు ఇచ్చిన ఉత్సాహం వల్లే సాధ్యమైంది" అని చెప్పింది.
ఈ పోటీల వెనుక ఉన్న చరిత్ర
ఈ వింతైన, సరదా పోటీ ఇప్పటిది కాదు. 1972లోనే ప్రారంభమైంది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లోని నాథన్స్ రెస్టారెంట్ ముందు ఈ పోటీని పండగలా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిని టీవీల్లో కూడా లైవ్‌గా టెలికాస్ట్ చేస్తారు.
