ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కారును వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కారును వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దగోల్కొండ వద్ద ORR ఎగ్జిట్-15 సమీపంలో తెల్లవారుజామున ఓ కారు లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ముగ్గురికి, అందులో ఓ మహిళ, ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

నల్గొండ జిల్లాలో కూడా ఆదివారం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కారును ఓ ప్రైవేటు ట్రావెల్స్​బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో తల్లి, బిడ్డ, కొడుకు, మరొకరు ఉన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన మలిరెడ్డి వీర వెంకట నాగవర ప్రసాద్ బాబు, తన భార్య విజయలక్ష్మి (40), బిడ్డ శ్రియ (17), కొడుకు ప్రభవ్ (12), ప్రసాద్ బాబు స్నేహితుడు (47) చెన్నై నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు.

ఉదయం సుమారు 5 గంటల సమయంలో వారు పెద్దకాపర్తి గ్రామ సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒడిశాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీంతో కారులో ఉన్న విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్​తో పాటు ప్రసాద్​బాబు స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందారు. 

ALSO READ : ఆదిలాబాద్లో వెరైటీ దొంగ.. అంజన్న కండ్లు కొట్టేసి.. 

ఆ సమయంలో కారు నడుపుతున్న ప్రసాద్ బాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్​గా ఉందని తెలిసింది. ప్రసాద్​బాబు స్వస్థలం కాకినాడ. కొంతకాలంగా ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఉంటోంది. అతని స్నేహితుడు హైదరాబాద్లోని కొంపల్లిలో ఉంటున్నారు.