ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం.. ఇప్పుడు అరెస్టులు, రిమాండ్‌లు తీవ్రస్థాయి సవాళ్లకు దారితీసింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూర జోసెఫ్ అరెస్ట్ కావడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. చట్టం తన పని తాను చేసుకుపోతోందని కూటమి ప్రభుత్వం అంటుంటే.. ఇది ముమ్మాటికీ కక్షసాధింపేనంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
అసలు ఏం జరిగిందంటే.. జనసేన పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై కేసు నమోదు చేశారు. కేవలం సాధారణ విమర్శలే కాకుండా.. ఏకంగా దేశద్రోహం, రాజద్రోహం వంటి అత్యంత తీవ్రమైన సెక్షన్లను ఈ కేసులో చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడిని గన్నవరం న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి జులై 18 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. భద్రతా కారణాలను అడ్డుపెట్టుకుని పోలీసులు అతడిని విజయవాడ నుంచి రాత్రికి రాత్రే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈ మొత్తం ఉదంతంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఒక వీడియో విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన యూట్యూబర్‌కు కోర్టు నాలుగు సార్లు బెయిల్ ఇచ్చినా.. ఇప్పుడు దేశద్రోహం కింద మళ్లీ ఎలా అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం కేసా? ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుల్ని నొక్కే కుట్ర అని అందరికీ అర్థమవుతోంది అంటూ పవన్ కల్యాణ్ పేరు ఎత్తకుండానే ప్రకాశ్ రాజ్ ఘాటుగా విమర్శించారు.
అంతటితో ఆగకుండా, తదుపరి చర్యగా రావణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే జనసైనికులు ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్ వీడియోలు చేయడం మొదలుపెట్టారని.. ప్రస్తుతం రావణ్ ఫోన్ పోలీసుల దగ్గరే ఉంది కాబట్టి, దానిలోని పర్సనల్ డేటాను లీక్ చేసి ఆయన్ని, ఆయనకు అండగా నిలిచిన వాళ్లని వేధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో మీ ఆట మొదలైంది.. ముగింపు మాత్రం ప్రజలే ఇస్తారు.. గేమ్ ఆన్ అంటూ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ప్రకాశ్ రాజ్.
