సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి కలిసి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద ప్రజల సొంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా.. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా గొప్పదని, దీనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పీఎం స్వయంగా అభినందించారని మంత్రి గుర్తు చేశారు.
కేవలం రెండో విడతతోనే ఆగకుండా.. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి ఇస్తామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు, మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా ఈ ఇండ్లను అందజేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక ప్రజా సంక్షేమ పథకాలను కూడా రూపొందించి ప్రజలకు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
పేదలకు ఏ విధంగా అండగా నిలవాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసని, అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నొక్కి చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా చాలా మంది ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పోతే.. తాము అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిమితి పెంచి, కొత్త రేషన్ కార్డులు ఇస్తూ పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందించి తీరుతామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.
