ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఫిఫా వరల్డ్ కప్‎లో ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ యూనియన్ సీరియస్

ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఫిఫా వరల్డ్ కప్‎లో ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ యూనియన్ సీరియస్

ఫిఫా వరల్డ్ కప్ 2026లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంస్థ (UEFA) సీరియస్ అయ్యింది. ట్రంప్ తీరు ఏ మాత్రం సమర్థనీయం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ జోక్యంతో ఫిఫా తన నిబంధనలను తుంగలో తొక్కి అమెరికా ప్లేయర్‎పై విధించిన సస్పెన్షన్‎ను ఎత్తేయడం ఫుట్‌బాల్ క్రీడా స్ఫూర్తికే విరుద్ధమని యూఈఎఫ్ఏ మండిపడింది. ఫిఫా తన హద్దులు దాటిందని.. రాజకీయ జోక్యం ఆట సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించింది.

‘‘అమెరికన్ స్ట్రైయికర్ ఫోలారిన్ బలోగన్‌కు రెడ్ కార్డ్ జారీ చేసినందుకు గాను విధించిన ఒక మ్యాచ్ ఆటోమేటిక్ సస్పెన్షన్‌ను ఏడాది పాటు నిలిపివేయాలన్న ఫిఫా నిర్ణయం హద్దులు దాటింది. ఇతర క్రీడల మాదిరిగానే ఫుట్‌బాల్ కూడా నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నియమాలే నిష్పక్షపాతమైన, నిజాయితీతో కూడిన పారదర్శకమైన పోటీకి ఆధారం. కొన్నిసార్లు నియమాలను తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. కానీ ఈ నిర్ణయం అలా కాదు. రెడ్ కార్డ్ వచ్చిన తర్వాత ఆటగాడిపై కనీసం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడం విచక్షణతో తీసుకునే నిర్ణయం కాదు. 

ఇది ఫిఫా నిబంధనలలో పొందుపరచబడిన ఒక రూల్. దీనికి మినహాయింపులు ఇవ్వడానికి వీలు లేదు. అంతేకాదు, ఒక టోర్నమెంట్ మధ్యలో అయితే అస్సలు వీలు లేదు. ఎందుకంటే, ఆ టోర్నమెంట్‌లో ఇప్పటికే చాలా మంది ఇతర ఆటగాళ్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొని, తమ సస్పెన్షన్‌ను అనుభవించి ఉంటారు. ఫిఫా తాజా నిర్ణయం అంతర్జాతీయ ఫుట్‌బాల్ విశ్వాసపు పునాదులకే ముప్పు తెస్తుంది’’ అని యూఈఎఫ్ఏ పేర్కొంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఫిఫా నిబంధనలను తుంగలో తొక్కితే ఆట సమగ్రత దెబ్బ తింటుందని హెచ్చరించింది. 

అసలేం జరిగిందంటే..?

ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో భాగంగా బోస్నియా అండ్ హెర్జెగోవినా, అమెరికా తలపడ్డాయి. ఈ మ్యాచ్ 64వ నిమిషంలో అమెరికా స్టార్ స్ట్రైకర్ బలోగన్‌కు మ్యాచ్ రిఫరీ రెడ్ కార్డ్ చూపించారు. ఫిఫా నిబంధనల ప్రకారం రెడ్ కార్డ్ వచ్చిన ఒక ఆటగాడు తదుపరి మ్యాచ్‌కు దూరమవ్వాల్సి ఉంటుంది. దీంతో బెల్జియంతో జరగనున్న కీలకమైన మ్యాచ్‌కు అమెరికా స్టార్ స్ట్రైకర్ దూరం కావాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పరపతి ఉపయోగించారు. తమ దేశ ఆటగాడు బలోగన్‌కు రెడ్ కార్డ్ ఇవ్వడంపై నేరుగా ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోకు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ట్రంప్ కాల్ అనంతరం ఫిఫా కీలక నిర్ణయం తీసుకుంది. 

బలోగన్‌పై విధించిన ఆటోమేటిక్ మ్యాచ్ సస్పెన్షన్‌ను ఏడాది పాటు ప్రొబేషనరీ పీరియడ్‌కు లోబడి నిలిపివేస్తున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఫిఫా నిర్ణయంతో బెల్జియంతో మ్యాచ్ ఆడేందుకు బలోగన్ కు లైన్ క్లియర్ అయ్యింది. ట్రంప్ రాజకీయ ఒత్తిడితో అమెరికా ప్లేయర్ పై విధించిన సస్పెన్షన్‎ను ఫిఫా ఎత్తేయడంపై యూరోపియన్ ఫుట్ బాల్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.