టూరిస్ట్ హబ్ గా దుర్గం చెరువు.. యాదాద్రి తరహాలో వీరభద్రుడి ఆలయాభివృద్ధి

టూరిస్ట్ హబ్ గా దుర్గం చెరువు.. యాదాద్రి తరహాలో వీరభద్రుడి ఆలయాభివృద్ధి

తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చేందుకు  ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై  సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఇవాళ (జులై 6) కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్,  పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైరదాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని అటవీ భూముల్లో పర్యాటక శాఖతో కలిసి భారీ ఎత్తున ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా  సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మార్చాలని.. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని సరికొత్త ఎకో పార్కులను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

నగరంలోని చారిత్రక, వారసత్వ కట్టడాల రూపురేఖలను మార్చాలని సీఎం సూచించారు. తారామతి బారాదరిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, దుర్గం చెరువును పూర్తి స్థాయి టూరిజం స్పాట్‌గా మార్చాలని ఆదేశించారు. వీటితో పాటు మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను ఆధునికీకరించాలని చెప్పారు. అలాగే, చారిత్రక పురానాపూల్ బ్రిడ్జి వంటి వారసత్వ సంపదను అభివృద్ధి చేసి, అవసరమైతే అక్కడి ట్రాఫిక్‌ను మరో మార్గంలో మళ్లించి.. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

మరోవైపు వికారాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక టూరిజం హబ్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అందులో భాగంగానే వికారాబాద్‌లోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, రాబోయే డిసెంబర్‌లో నిర్వహించనున్న 'గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్' కోసం ఇప్పుడే కసరత్తు ప్రారంభించాలని.. టూరిజం రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా వివిధ శాఖల సమన్వయంతో ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.