స్టాక్ మార్కెట్లో లాభాల కథలు ఎంత వేగంగా వైరల్ అవుతాయో.. నష్టాల స్టోరీలు అంతకంటే పెద్ద పాఠాలు నేర్పుతాయి. ఒక్క తప్పు నిర్ణయం, స్టాప్‌లాస్‌ను పట్టించుకోకపోవడం, పడిపోతున్న షేర్లలో మళ్లీ మళ్లీ డబ్బు పెట్టడం.. చివరకు కోట్ల రూపాయల పోర్ట్‌ఫోలియోను లక్షల నష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా ట్రేడర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎక్స్ లో @SystemTraderIN అనే యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. టీసీఎస్ , ఇన్ఫోసిస్ షేర్లలో పెట్టుబడి పెట్టి రూ.57 లక్షలు నష్టపోయానని వెల్లడించాడు. ఒకప్పుడు తన పోర్ట్‌ఫోలియో విలువ రూ.కోటి 72లక్షలు ఉండేదని, కానీ కొద్ది నెలల్లోనే అది రూ.కోటి15లక్షలకు పడిపోయిందని చెప్పాడు. మార్కెట్ పడిపోతున్నా తాను తెలివిగా బాటమ్ పట్టుకుంటానని భావించి.. మళ్లీ మళ్లీ అదే షేర్లను కొనుగోలు చేశానని, స్టాప్‌లాస్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశానని చేసిన తప్పులను ఒప్పుకున్నాడు.
₹57 LAKHS GONE. My life savings destroyed in TCS & Infosys 😭💔
— SYSTEM TRADER (@SystemTraderIN) July 5, 2026
From ₹1.72 CRORE → ₹1.15 CRORE in months.
-33% bloodbath.
I kept averaging down like an idiot. Ignored every stop-loss. Thought I was smarter than the market.
Now I’m just crying, can’t sleep, can’t eat.… pic.twitter.com/dWzp98MrNx
"మార్కెట్ కంటే నేనే తెలివైనవాడిని అనుకున్నాను. కానీ నా అతివిశ్వాసమే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు నిద్ర పట్టడం లేదు.. తినాలనిపించడం లేదు.. నా లైఫ్ సేవింగ్స్ కళ్ల ముందే కరిగిపోయింది" అంటూ సదరు ట్రేడర్ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ నష్టం కారణంగా తన ఆల్గో ట్రేడింగ్ వ్యాపారంపై కూడా ప్రభావం పడిందని.. షేర్లను తాకట్టు పెట్టి ట్రేడింగ్ చేయడంతో ఇప్పుడు మార్జిన్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయని చెప్పాడు.
అయితే ఈ పెట్టుబడులు తన ఆల్గో ట్రేడింగ్‌లో భాగం కాదని మరో పోస్టులో స్పష్టం చేశాడు ట్రేడర్. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా చేసిన "కాంట్రా బెట్టింగ్" ఇదని.. అత్యాస, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తాను రూపొందించుకున్న ట్రేడింగ్ రూల్స్ తానే ఉల్లంఘించానని అంగీకరించాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనంటున్నారు నెటిజన్లు. తెలిసితెలిసి గోతిలో పడటం దేనికని అంటున్నారు.
ఈ పోస్టుపై స్పందించిన పలువురు ఇన్వెస్టర్లు అతనికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఐటీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందని, దీర్ఘకాలంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బలమైన కంపెనీలు కోలుకునే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు రోజూ పోర్ట్‌ఫోలియో చూస్తూ ఆందోళన చెందడం కంటే.. కొంతకాలం సహనంతో ఉండాలని సూచించారు. అయితే ఆర్థికంగా అత్యవసర పరిస్థితి ఎదురైతేనే నష్టాల్లో స్టాక్స్ అమ్ముకోమని లేదంటే కొన్నాళ్లు ఆగమని సూచిస్తున్నారు.
ALSO READ : ఈసారి వర్షాలు తక్కువైతే ధరలు పెరుగుతాయ్..
ఇది ప్రతి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌కు ఒక కీలక సందేశాన్ని ఇస్తోంది. మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టడం మాత్రమే సరిపోదు.. రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్‌లాస్, పెట్టుబడి క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని నిరూపిస్తోంది. మార్కెట్లో అతివిశ్వాసం కంటే చేస్తున్న పనిపై కంట్రోల్ సంపదను కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
